బీచ్ రోడ్డులో రాత్రికి రాత్రే హరికృష్ణ విగ్రహం: యార్లగడ్డకు నోటీసులు

By pratap reddyFirst Published Dec 3, 2018, 11:09 AM IST
Highlights

హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రఖ్యాతి వహించిన ప్రసిద్ధుల విగ్రహాలను స్థానికేతరులైనప్పటికీ స్థాపించడం ఆనవాయితీ. సినిమా రంగంలో గానీ రాజకీయాల్లో గానీ ఇతర రంగాల్లో గానీ హరికృష్ణ విగ్రహం నెలకొల్పదగినంతటి మహా పురుషుడేమీ కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 

విశాఖపట్నం: విశాఖపట్నం బీచ్ రోడ్డులో ఇటీవల రాత్రికి రాత్రే మాజీ పార్లమెంటు సభ్యుడు నందమూరి హరికృష్ణ విగ్రహం వెలిసింది. అకస్మాత్తుగా దర్శనమిచ్చిన ఈ విగ్రహం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. విశాఖపట్నంతో ఏ విధమైన సంబంధం లేని హరికృష్ణ విగ్రహం నెలకొల్పడంపై స్థానికులు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు 

హరికృష్ణ నల్లగొండ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ప్రఖ్యాతి వహించిన ప్రసిద్ధుల విగ్రహాలను స్థానికేతరులైనప్పటికీ స్థాపించడం ఆనవాయితీ. సినిమా రంగంలో గానీ రాజకీయాల్లో గానీ ఇతర రంగాల్లో గానీ హరికృష్ణ విగ్రహం నెలకొల్పదగినంతటి మహా పురుషుడేమీ కాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు అక్కినేని నాగేశ్వర రావు, దాసరి నారాయణ రావు విగ్రహాల సరసన హరికృష్ణ విగ్రహం కనిపించడంపై నిరసన వెల్లువెత్తుతోంది.

అయితే, ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ చొరవతోనే హరికృష్ణ విగ్రహ స్థాపన జరిగిందనే మాట వినిపిస్తోంది. తమ అనుమతి లేకుండా బీచ్ రోడ్డులో విగ్రహాలు ఏర్పాటు చేసిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కు జీవిఎంసీ నోటీసులు జారీ చేసింది. జీవీఎంసి కమిషనర్ హరినారాయణ ఆదేశాల మేరకు జోన్ -2 కమిషనర్ నల్లనయ్య నోటీసులు జారీ చేశారు. వారంలోగా వివరణ ఇవ్వాలని జీవిఎంసి ఆదేశించింది. గడువులోగా వివరణ ఇవ్వకపోతే విగ్రహాలను తొలగిస్తామని చెప్పింది.

విగ్రహాల ఏర్పాటును యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమర్థించుకుంటున్నారు. వాటి ఏర్పాటు విషయంలో తన తప్పేమీ లేదని, నగరంలో అనేక మంది విగ్రహాలు ఏ విధమైన అనుమతి లేకుండానే ఏర్పాటు అవుతున్నాయని ఆయన అన్నారు. ఆ నేపథ్యంలో కళా, రాజకీయ రంగ ప్రముఖుల విగ్రహాలను తాను ఏర్పాటు చేస్తే తప్పేమిటని అంటున్నారు. విగ్రహాలను తొలగించే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 

click me!