
తిరుపతి: ఏపీ రాజధాని విషయంలో వైసిపి (YCP) ప్రభుత్వానికి, అమరావతి (amaravati) ప్రజలకు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని ఆ ప్రాంత ప్రజలతో పాటు ప్రతిపక్ష టిడిపి (TDP) డిమాండ్ చేస్తుంటే మూడు రాజధానుల (three capitals) నిర్ణయానికి కట్టుబడి వున్నామని జగన్ సర్కార్ అంటోంది. ఇలా ఇప్పటికే రాజధాని విషయంలో గందరగోళం నెలకొన్న తరుణంగా ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ (chinta mohan) కీలక వ్యాఖ్యలు చేసారు.
ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా తిరుపతి (tirupati)ని ప్రకటించాలని చింతా మోహన్ వైసిపి ప్రభుత్వానికి సూచించారు. ఏర్పేడు-రావూరు మధ్యలో 1.5లక్షల ఎకరాలు అందుబాటులో వుంది... కాబట్టి అక్కడ సకల సౌకర్యాలతో అద్భుతమైన రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించారు. ఈ ప్రాంతంలో అయితే రాజధాని అన్ని జిల్లాలకు అందుబాటులో వుంటుందన్నారు.
ఇప్పటికే తిరుపతిలో అంతర్జాతీయ విమానాశ్రయం (tirupati international airport) వుందన్నారు. అలాగే చాలా జాతీయ రహదారులు ఇప్పటికే తిరుపతి ప్రాంతంలో అందుబాటులో వున్నాయన్నారు. కడలేరు, సోమశిల జలాశయాలు కూడా తిరుపతికి సమీపంలో వున్నాయన్నారు. ఇలా అన్ని రకాలుగా తిరుపతిలో రాజధానికి అనుకూలమైన పరిస్థితులు వున్నాయని... కాబట్టి ఇక్కడే ఏర్పాటుచేయడం ఉత్తమమని మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ అభిప్రాయపడ్డారు.
read more జగన్ మూడు జన్మలెత్తినా... మూడు రాజధానులు అసాధ్యం: నారా లోకేష్
ఆదివారం సుళ్లూరుపేటలో చింతామోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ప్రస్తావన తీసుకురావడంతో పాటు ప్రధాని మోదీ, సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు. ఏపీ రాజధాని అమరావతి కోసం ప్రధాని వేసిన పునాది అనాథగా మిగిలిపోయిందని ఎద్దేవా చేసారు. దేశంలో ప్రస్తుతం పాలన అద్వాన్నంగా వుందని... నల్లదనానికి పీఎంవో (PMO) కేరాఫ్ అడ్రస్ గా మారిందని చింతా మోహన్ ఆరోపించారు.
ఇక రాష్ట్రంలోనూ పరిపాలన గాడి తప్పిందని... జగన్ సర్కార్ పతనావస్థకు చేరుకుందని అన్నారు. చంద్రబాబు కూడా రాష్ట్రానికి అన్యాయం చేసారని... దుగరాజపట్నం ఓడరేవు రాకుండా అడ్డుకున్నదని ఆయనేనని చింతా మోహన్ ఆరోపించారు.
ఇటీవల అమరావతిని మాత్రమే రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు న్యాయస్థానం నుండి దేవస్థానం అంటూ భారీ పాదయాత్ర చేపట్టారు. అమరావతి నుండి తిరుపతికి ఈ పాదయాత్ర సాగింది. తిరుపతిలో భారీ బహిరంగ సభతో ఈ పాదయాత్ర ముగిసింది. ఇలా అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ సభ జరిగిన తిరుపతినే ఇప్పుడు రాజధానిగా చేయాలంటూ చింతా మోహన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.
ఇదిలావుంటే మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి వున్నామని... ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నంలో పరిపాలన, కర్నూల్ లో న్యాయ రాజధాని ఏర్పాటుచేసి తీరతామని వైసిపి ప్రభుత్వం అంటోంది. అమరావతిని కేవలం శాసన రాజధానిగా మాత్రమే కొనసాగిస్తామని చెబుతోంది. మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే సీఎం జగన్ తో పాటు వైసిపి మంత్రులు కూడా పలుమార్లు స్పష్టం చేసారు.