
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ.. వరద బాధితులను పరామర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే అరిగెలవారి పేటలో వైఎస్ జగన్ వరద బాధితులతో మాట్లాడారు. వరద బాధితులందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు కౌంటర్ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలని అన్నారు. వరదల సమయంలో డ్రామాలు ఆడకుండా.. అధికారులను అప్రమత్తం చేసి ప్రజలకు సాయం అందేలా చేశానని చెప్పారు.
‘‘వరదల్లో నేను ఇక్కడకు వచ్చి ఉంటే అధికారులు నా చుట్టూ తిరిగేవాళ్లు. నేను టీవీల్లో బాగా కనబడేవాడని. నా ఫొటోలు బాగా వచ్చేవి. కానీ ప్రజలకు మంచి జరగకపోయేది. ప్రజలకు మంచి చేయాలంటే డ్రామాలు పక్కనపెట్టాలి. ప్రజలకు మంచి చేసేందుకు అధికారులకు అన్ని రకాల వనరులు ఇచ్చాను.అధికారులకు వారం టైం ఇచ్చి నేను ఇక్కడికి వచ్చా. మీ అందరికీ మంచి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది’’ అని సీఎం జగన్ చెప్పారు.
ఇక, వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులతో మాట్లాడుతూ సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. రాత్రికి సీఎం జగన్ రాజమహేంద్రవరం చేరుకోనున్నారు. రాజమండ్రి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ గెస్ట్ హౌస్‌లో గోదావరి రీజియన్ అధికారులతో సీఎం జగన్ రెస్క్యూ, రిలీఫ్ ఆపరేషన్‌లను సమీక్షిస్తారు. రాత్రి సీఎం జగన్ రాజమహేంద్రవరంలో బస చేస్తారు.
ఇదిలా ఉండగా వరద ప్రభావిత ఆరు జిల్లాల్లో 218 సహాయ శిబిరాలను ప్రారంభించామని ఏపీ సర్కార్ తెలిపింది. ముంపునకు గురైన గ్రామాల నుంచి 1,43,614 మందికి సహాయ శిబిరాల్లో వసతి కల్పించామని చెప్పింది.