
అమరావతి: ఆసరా పథకం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని కోటి మంది డ్వాక్రా మహిళలను నిట్టనిలువునా మోసం చేస్తున్నారని ఏపీ టిడిపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆరోపించారు. స్వయంఉపాధి, మహిళా సాధికారిత విషయంలో ys jagan దగా చేస్తున్నారన్నారు. ఆసరా పేరుతో హడావుడి చేస్తున్న ప్రభుత్వం ఆ తర్వాత మహిళా సాధికరత అన్న పదాన్నే మరిచిపోతోందని అచ్చెన్న మండిపడ్డారు.
''98 లక్షల మంది డ్వాక్రా మహిళలున్నారని.. వారికి సున్నా వడ్డీ రుణాలు మంజూరు చేస్తున్నానని సొంత పత్రికలో ప్రచారం చేసుకుంటున్నావు. కానీ పథకాలు అమలు చేయాల్సి వచ్చినపుడు లక్షలాది మంది మహిళల సంఖ్యను తగ్గించేస్తున్నావు. వాళ్లేమన్నా అంకెలు అనుకున్నావా? వారు ప్రతి ఒక్కరూ ఒక్కో కుటుంబానికి ప్రతినిధి, సమాజానికి మార్గదర్శి. గతేడాది ఆసరా 87 లక్షల మందికి అన్నావు... ఈ ఏడాది 78.76 లక్షల మందికే అంటున్నావు. మిగిలిన ఎనిమిదిన్నర లక్షల మంది డ్వాక్రా మహిళలు ఏమయ్యారు.? ఇది ఆసరానా.. వాళ్లని ఆదుకునే పథకమా.?'' అంటూ kinjarapu atchannaidu ఎద్దేవాచేశారు.
''మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అంటూ హడావుడి చేశావ్. నవరత్నాలకు క్యాలెండర్ విడుదల చేశావ్. చెప్పిన తేదీన మీట నొక్కి పథకం సొమ్ము ఖాతాల్లో జమ చేస్తానన్నావ్. గత సెప్టెంబరులో నొక్కాల్సిన మీట ఎందుకు నొక్కలేదు.? ఇప్పుడు నెల తర్వాత పది రోజుల పాటు విడతలుగా మీట నొక్కి జమ చేస్తాను అంటున్నావు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్నావ్. ఇప్పుడు ఒక విడతను పది విడతలు చేశావు. ఇది మాట తప్పడం మడమ తిప్పడం కాదా.?'' అంటూ ప్రశ్నించారు.
read more హామీల అమలుతోనే ప్రజల ఆశీర్వాదాలు: వైఎస్ఆర్ ఆసరా నిధులు విడుదల చేసిన జగన్
''ఎన్నికల ప్రచారం, పాదయాత్రలో 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు నెలకు రూ.3వేల చొప్పున సహాయం చేస్తానన్నావు. దీంతో సంవత్సరానికి రూ.36వేల చొప్పున ఐదేళ్లకు రూ.1.80లక్షలు వస్తుందని రాష్ట్రంలోని 45లక్షల పైచిలుకు మహిళలు నీకు ఓట్లు వేసి గెలిపించారు. గెలిచిన నీవు చేయూత పేరుతో సంవత్సరానికి రూ.18,750 చొప్పున ఇస్తానంటూ మాట తప్పి.. మడమ తిప్పి ఒక్కో మహిళకు రూ.1.05 లక్షల చొప్పున ఎగనామం పెట్టావు. ఇది మహిళలను ఉద్దరించడమా.? మోసం చేయడమా.?'' అని TDP నేతఅచ్చెన్న నిలదీశారు.
''తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.5లక్షల రుణం వరకు సున్నా మంజూరు చేస్తే.. మీరు ఆ రుణాల పరిమితిని రూ.3 లక్షలకు కుదించడం ఏ రకంగా అక్కచెల్లెమ్మలకు మేలు చేసినట్లు.? ఈ రెండున్నరేళ్లలో డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల ద్వారా ఎంత మొత్తం రుణం మంజూరు చేయించావో శ్వేతపత్రం విడుదల చేయాలి. డ్వాక్రాను ఉద్దరిస్తున్నట్లు చెప్పుకుంటున్న నీవు.. డ్వాక్రా మహిళల రూ.8700 కోట్ల పొదుపు నిధిని అస్తవ్యస్తంగా ఉన్న కో-ఆపరేటివ్ బ్యాంకులకు మళ్లించి వాళ్లను అగాథంలోకి నెట్టే ప్రయత్నం కాదా.? ఇళ్ల నిర్మాణాలకు డ్వాక్రా సంఘాల పొదుపు సొమ్మును మళ్లించేందుకు ప్రయత్నించడం వారి సొంత విషయాల్లో జోక్యం చేసుకోవడం కాదా.?'' అని అడిగారు.
''తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్లలో ఉన్నతి పథకం ద్వారా రూ.800 కోట్లు, స్త్రీ నిధి పథకం ద్వారా రూ.4,455 కోట్లు, బ్యాంకు లింకేజీ ద్వారా రూ.68,830 కోట్లు, పసుపు కుంకుమ ద్వారా రూ.18,600 కోట్లు, వడ్డీ రాయితీ ద్వారా రూ.2,514 కోట్లు, రుణమాఫీ పథకం మొదటి విడతలో రూ.3,800 కోట్లు, 2వ విడతలో రూ.2,500కోట్లు చొప్పున మొత్తంగా రూ.1,01,449 కోట్లు డ్వాక్రా మహిళల సాధికారతకు ఉపయోగపడింది నిజం కాదా.? రెండున్నరేళ్లలో మీరు ఇచ్చిందెంత.? చేసుకున్న ప్రచారం ఎంత.?'' అని అచ్చెన్న నిలదీశారు.