వచ్చే ఎన్నికల్లో రెడ్ల మద్దతు ఎవరికి?

First Published Mar 11, 2017, 1:14 AM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో టిడిపిలోనే కొనసాగాలా? లేక వైసీపీకి మద్దతివ్వాలా? జనసేన పరిస్ధితి ఏమిటి? అన్న విషయాలపై సామాజికవర్గంలో డిబేట్ మొదలైనట్లు సమాచారం.

రాష్ట్రంలోని రెడ్డి సామాజికవర్గానికి ప్రధానంగా రాయలసీమలోని వారికి పెద్ద సమస్యే వచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నదే ఆ సమస్య. ఎన్నికలేమో మరో రెండున్నరేళ్లలోకి వచ్చేసింది. ఒక వైపు రాజకీయ వేడి ఎక్కువైపోతోంది. ఇంకోవైపు పార్టీల వారీగా సామాజికవర్గాలు ఏకమైపోతున్నాయి. ఈ పరిస్ధితుల్లో రెడ్లలో అయోమయం మొదలైంది. కాపు సామాజికవర్గం జనసేన వైపు చూస్తోంది. కమ్మ సామాజికవర్గం ఎటుతిరిగీ టిడిపితోనే ఉంటుంది. మరి రెడ్లు ఏం చేయాలి?

 

దశాబ్దాలుగా రెడ్లు కాంగ్రెస్ నే అంటిపెట్టుకున్నారు. చాలా సామాజికవర్గాల్లాగే రాష్ట్ర విభజన నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి రెడ్లు కూడా దూరమయ్యారు. అలాగని జగన్మోహన్ రెడ్డికీ మద్దతు ఇవ్వటానికి మనసొప్పలేదు. దాంతో కొందరు తప్పనిసరి పరిస్ధితిలో టిడిపికి జై కొట్టారు. మరికొందరేమో భాజపాలో చేరారు. మరికొందరు ఏ పార్టీలోనూ చేరలేదు. అయితే, ఎంతకాలం తటస్ధంగా ఉంటారు? టిడిపికి జై కొట్టిన వారిలో చాలామంది ఇపుడు సఫకేషన్ ఫీలవుతున్నారట. పైగా మొత్తం రెడ్డి సామాజికవర్గాన్నే కించపరిచే మాటలు వినాల్సి వస్తోంది. దాంతో రెడ్లలో పునరాలోచన మొదలైంది.

 

చాలామంది కాంగ్రెస్ నేతల్లాగే అనంతపురంలో జెసి సోదరులు కూడా టిడిపిలో చేరారు. అయితే, అప్పటి నుండి సొంత సామాజికవర్గాన్నే కించ పరిచేవిధంగా జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. నిజమైన రెడ్లు ఎవ్వరూ జగన్ను సమర్ధించకూడదంటూ ఆంక్షలు పెడుతున్నారు. ఇక్కడే చాలా మంది రెడ్లకు చిర్రెత్తుతోంది. మొత్తం సామాజికవర్గం తరపున జెసి వకాల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడటాన్ని చాలామంది భరించలేకున్నారు. 

 

 నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ శాతం తన సామాజికవర్గానికే ఇచ్చుకున్న చంద్రబాబు, ముఖాముఖి తలపడాల్సిన ఎన్నికల్లో మాత్రం రెడ్డి సామాజికవర్గాన్ని రంగంలోకి దింపుతున్న విషయంపై కూడా సామాజికవర్గంలో చర్చ మొదలైంది. కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్ల స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికలనే ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఈ పరిస్ధితుల్లో వచ్చే ఎన్నికల్లో టిడిపిలోనే కొనసాగాలా? లేక వైసీపీకి మద్దతివ్వాలా? జనసేన పరిస్ధితి ఏమిటి? అన్న విషయాలపై సామాజికవర్గంలో డిబేట్ మొదలైనట్లు సమాచారం. ఏం జరుగుతుందో చూడాలి.

click me!