
ఓటుకునోటు కేసు చంద్రబాబునాయడుపై బాగా ఒత్తిడి పెంచుతోంది. ఓటుకునోటు కేసులో ఏసిబి దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ లో సిఎం పేరున్న కారణంగా చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఒకవైపు సుప్రింకోర్టు నోటీసులు, ఇంకోవైపు ఏసిబి దాఖలు చేసిన అదనపు ఛార్జ్ షీట్ తో బాగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దాంతో ప్రతిపక్షాలు రోజు రోజుకు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నాయి రాజీనామా కోసం. ఇదే విషయమై పార్టీలో కూడా సర్వత్రా చర్చ మొదలైంది. కాకపోతే కేసు సాక్షాత్తు తమ అధినేతదే కావటంతో బహిరంగంగా చర్చించేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు.
ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్ తరపున బొత్సా సత్యనారాయణ, రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ఛార్జ్ షీట్లో 30 సార్లు పేర్లున్న చంద్రబాబు ఏ విధంగా సిఎంగా కొనసాగుతారంటూ ప్రశ్నించారు. ఛార్జ్ షీట్లో పేరున్న సిఎం ఎవరూ పదవిలో కొనసాగిన దాఖలాలు దేశం మొత్తం మీద లేదన్నారు. కేసులో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలంటూ వారు సిఎంకు సవాలు విసురుతున్నారు. మరోవైపు ఇదే డిమాండ్ తో వామపక్షాలు కూడా ఉద్యమాలకు రెడీ అవుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతుండటంతో సభలో కూడా ఇదే అంశాన్ని లేవనెత్తేందుకు వైసీపీ అస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది.