పవన్ కల్యాణ్ 'మెగా' అస్త్రం : తమ్ముడి కోసం రంగంలోకి చిరంజీవి

By Arun Kumar PFirst Published May 7, 2024, 3:40 PM IST
Highlights

జనసేనాని పవన్ కల్యాణ్ కోసం అతడి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగారు. తన తమ్ముడిని గెలిపించుకునేందుకు మెగాస్టార్ తనవంతుగా ఓ ఆసక్తికర వీడియోను విడుదల చేసారు.

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఆరురోజుల్లో పోలింగ్ జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలన్ని తమ అస్త్రశస్త్రాలను బయటకు తీస్తున్నాయి. ఇలా జనసేనాని పవన్ కల్యాణ్ కోసమైతే మెగా అస్త్రం రెడీ అయ్యింది. తన తమ్ముడికి మద్దతుగా మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేసారు. తన తమ్ముడు పవన్ గురించి గొప్పగా చెబుతూ అతడిని గెలిపించుకోవాలని పిఠాపురం ప్రజలను కోరారు చిరంజీవి. 

''కొణిదల పవన్ కల్యాణ్... అమ్మ కడుపున ఆఖరిగా పుట్టినా అందరికీ మంచి చేయడంలో ముందున్నాడు. తన గురించి కంటే  జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడిది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదయినా చేయాలని అనుకుంటారు... కానీ కల్యాణ్ సొంత సంపాదనతో కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు చేసాడు. సరిహద్దుల్లో తమ ప్రాణాలకు తెగించి దేశంకోసం పోరాడే జవాన్లు, మత్స్య కారులు ఇంకా ఎందరికో సాయం చేసాడు... ఇదంతా చూస్తే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది'' అని చిరంజీవి అన్నారు. 

''ఒకరకంగా చెప్పాలంటే సినిమాల్లోకి బలవంతంగా వచ్చిన పవన్ రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగా వచ్చారు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది... ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. ఇలా బాధపడుతున్న నా తల్లికి ఓ మాట చెప్పాను... నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ల బిడ్డల భవిష్యత్ కోసం యుద్దం చేస్తున్నాడు... కాబట్టి మన బాధకంటే అతడి పోరాటం ఎంతో గొప్పది'' అని చెప్పానన్నారు. 

''అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా వుండే మంచివాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి మరింత నష్టమని నమ్మిన నా తమ్ముడు జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్దాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ కల్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్ కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్టసభల్లో అతడి గొంతును మనం వినాలి. జనమే జయమని నమ్మే జనసేనాని ఏం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు కల్యాణ్ ని గెలిపించాలి. మీకు సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు. మీకోసం తలబడతాడు.. కలలను నిజం చేస్తాడు'' అని చిరంజీవి తెలిపారు. 

చివరగా తన తమ్ముడికి ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అండగా నిలవాలని చిరంజీవి కోరారు. ముఖ్యంగా పిఠాపురం వాస్తవ్యులు గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి విజ్ఞప్తి చేసారు.

జనమే జయం అని నమ్మే జనసేనాని ని గెలిపించండి. pic.twitter.com/zifXEqt30t

— Chiranjeevi Konidela (@KChiruTweets)

 


 

click me!