చింతమనేని అరెస్ట్... డిజిపి సవాంగ్ కు టిడిపి చీఫ్ చంద్రబాబు లేఖ

By Arun Kumar PFirst Published Aug 30, 2021, 12:26 PM IST
Highlights

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై స్పందిస్తూ డిజిపి గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు చంద్రబాబు నాయుడు. 

అమరావతి: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలుగుదేశం పార్టీ నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ నిరసనలో పాల్గొన్న నాయకులపై పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తున్నారని... ఈ అక్రమ అరెస్టులను ఖండిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. 

''ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యాన్ని 'వైఎస్ఆర్‌సిపి అధికార ప్రేరేపిత పోలీసు రాజ్యం' గా మార్చేసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చిన్న విమర్శ చేసినా ఒక వర్గం పోలీసులు సాధారణ ప్రజలతో పాటు ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారు. తమ అసమ్మతిని తెలియజేసే అమాయక ప్రజలను అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా గృహ నిర్బంధం చేస్తున్నారు, తప్పుడు కేసులతో వేధిస్తున్నారు'' అని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. 

''అసమ్మతి వ్యక్తీకరణ అనేది భారత రాజ్యాంగ ప్రాథమిక హక్కులలో హామీ ఇవ్వబడిన వాక్ స్వేచ్ఛలో భాగం. ఇది ప్రజాస్వామ్య హక్కు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు రెండూ పూర్తిగా ఉల్లంఘించబడుతున్నాయి. ప్రతిపక్ష నాయకులపై వరుస దాడులు చేస్తున్నారు. అందులో భాగమే తాజాగా మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నాయకులు చింతమనేని ప్రభాకర్ అరెస్టు'' అని అన్నారు. 

''పెట్రోల్, డీజిల్ ధరలను అనాలోచితంగా పెంచడంపై చింతమనేని ప్రభాకర్ నిరసన వ్యక్తం చేసి 2021 ఆగస్టు 28న లేఖ ఇచ్చేందుకు దెందులూరు తహశీల్దార్‌ను కలిశారు. శాంతియుతంగా నిరసన తెలిపిన ప్రభాకర్ పై ఐ.పి.సి సెక్షన్లు 143, 341, 290, 353, 269, 271 r/w 149 IPC, 32 PA-1861, 51(a)విపత్తు నిర్వహణ చట్టం 2005 కింద తప్పుడు కేసు నమోదుచేశారు'' అన్నారు. 

read more  రోజులు దగ్గరపడ్డాయి... ఆ ఉప్పెనలో వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం: అచ్చెన్న హెచ్చరిక

''పైన పేర్కొన్న సెక్షన్‌లు సరిపోవన్నట్లు విశాఖపట్నంలో ప్రభాకర్‌ను అక్రమ అరెస్టు చేశారు. ఒక విపక్ష పార్టీ నాయకుడిని, మాజీ ఎమ్మెల్యేని ఇంత దుర్మార్గంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమిటి? ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం (తహశీల్దార్) ఆయన చేసిన తప్పా? పోలీసుల ఫిర్యాదు ఆధారంగా తప్పుడు కేసు ఏ విధంగా నమోదు చేస్తారు? నిరసన ద్వారా అసమ్మతిని తెలియజేయడం చట్టవిరుద్ధమా?'' అని చంద్రబాబు డిజిపిని నిలదీశారు. 

''ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే పెంచిన పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ ఛార్జీలు, మునిసిపల్ పన్నులు తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించాలి. పోలీసులు శాంతిభద్రతలను విస్మరించి టిడిపి నాయకులపై తప్పుడు ఫిర్యాదులు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతీ రోజు హత్యలు,  అత్యాచారాలు జరుగుతున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిరంతరం భయం, అభద్రతలో జీవిస్తున్నారు'' అని ఆందోళన వ్యక్తం చేశారు. 

''రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ అహంకారపూరిత అప్రజాస్వామిక చర్యలను గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో పోలీసుల ప్రస్తుత పనితీరు ఒక బ్లాక్ మార్క్‌గా నిలిచిపోతుంది. కనీసం ఇకనైనా లా అండ్ ఆర్డర్ వైఫల్యాలను తెలుసుకోవాలని రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను'' అని డిజిపికి సూచించారు. 

''ఏపీ భద్రతా కమిషన్‌లో ప్రతిపక్ష నాయకుడిని సభ్యుడిగా చేర్చినప్పటికీ, ఇప్పటి వరకు ఒక సమావేశం కూడా జరగలేదు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని నిరూపించకునేందుకు 28 ఆగస్టు 2021న రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష టిడిపి నాయకులపై నమోదు చేసిన అన్ని తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి. కనీసం ఇకనైనా పోలీసులు ప్రతిపక్ష టీడీపీ నాయకులను వేధించడం మాని రాష్ట్రంలో నేరాల రేటును నియంత్రించడంపై దృష్టి పెట్టాలి'' అని తన లేఖ ద్వారా చంద్రబాబు సూచించారు. 

click me!