జగన్ వల్లే వర్షాలు కురుస్తున్నాయన్న మంత్రి... స్ట్రాంగ్ కౌంటరిచ్చిన చినరాజప్ప

By Arun Kumar PFirst Published Jul 13, 2020, 9:31 PM IST
Highlights

సీఎం జగన్ వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని మంత్రి కురసాల కన్నబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. 

గుంటూరు: సీఎం జగన్ వల్లే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని మంత్రి కురసాల కన్నబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఎద్దేవా చేశారు. అలా అయితే రాష్ట్రంలో కరోనా కేసులు కూడా జగన్ వల్లే పెరుగుతున్నాయని అంగీకరిస్తారా? అని ప్రశ్నించారు.  ఇలాంటి చేతగాని మాటలు మాట్లాడి మంత్రి స్థానానికే విలువను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు మంత్రులు విజ్ఞానాన్ని బోధించాలి గాని మూడ నమ్మకాలను బోధించకూడదన్నారు చినరాజప్ప. 

''జగన్ మాటల్లో  రైతు సంక్షేమం కాదు రైతు ద్రోహం ఉన్నది. రూ.20వేల కోట్ల బడ్జెట్ లో కేవలం రూ.7వేల కోట్లు మాత్రమే రైతులకు ఖర్చు చేశారు. ఇది ద్రోహం కాదా? జగన్  ఏడాది పాలనలో 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆఖరికి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వేణుగోపాల్ రెడ్డి అనే రైతు ఆత్మహత్య చేసుకోవడం రైతులకు జగన్ చేస్తున్న ద్రోహానికి అద్దం పడుతోంది'' అని పేర్కొన్నారు. 

''వైఎస్ హయాంలో కోనసీమలో క్రాప్ హాలీడేలు ప్రకటించిన సంగతి గోదావరికి చెందిన కన్నబాబుకు తెలిసీ అబద్దం చెబుతున్నారు. ఆయన పాలనలో దాదాపు 14,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పులివెందులకు నీళ్లిచ్చారు. 23 ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసి 32 లక్షల ఎకరాలకు సాగు నీటి స్థిరత్వం కలిగించారు'' అని అన్నారు. 

read more   జగన్ సర్కార్ గుడ్‌న్యూస్: వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ, మరో 6 జిల్లాలకు విస్తరింపు

''పోలవరం ప్రాజెక్టుకు అనుభవం లేని కాంట్రాక్టర్ కు కట్టబెట్టి గోదావరి జిల్లా ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టారు. జగన్ రెడ్డి ఏ విధంగా రైతు ఉద్దారకుడో కన్నబాబు చెప్పాలి. 
జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాతే మీ చేతగాని తనం వలన పురుషోత్తమపట్నం, విశాఖ పనులపైన కేంద్రం నిలుపుదల చేసింది. వరద ముంపులో సచివాలయం ఉందనేది కొండంత అబద్దం. వరద ముంపు లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన తరువాత దానికి వ్యతిరేకంగా కన్నబాబు మాట్లాడటం సిగ్గుచేటు'' అని మండిపడ్డారు. 

''అబద్దాల ఫ్యాక్టరీ, అవినీతి పరాకాష్ట పేటెంట్ రైట్స్ జగన్ కుటుంబానికి తప్ప మరెవ్వరికి సాధ్యం కాదు. ఉత్తరాంధ్రలో రూ.3 కోట్ల లంచం ఇవ్వలేదని ఏడీ ప్రతాప్ రెడ్డి ఎంఎస్ఎంఈ అయిన వీ.వీ.ఆర్ మైనింగ్ ఎస్టేట్ పై రూ.33 కోట్ల అక్రమ ఫైన్ విధించి చిన్న పరిశ్రమలను నాశనం చేస్తుంది కన్నబాబుకు కనపడలేదా?'' అని నిలదీశారు.

'' ఎస్సీ సబ్ ప్లాన్ కు చంద్రబాబు హయాంలో 2018-19లో రూ.9వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి 2019-20 లో కేవలం రూ.4,700 కోట్లు ఖర్చు పెట్టారని బడ్జెట్ లో స్పష్టంగా ఉంది. ఇది దళితులకు జగన్ చేస్తున్న ద్రోహంలా మంత్రి కన్నబాబుకు కనపడటం లేదా? బీసీల రిజర్వేషన్ 34 శాతం 24 శాతం తగ్గించి బీసీ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి దాడులు చేస్తుంది కన్నబాబుకు కనపడటం లేదా?'' అంటూ ప్రశ్నించారు. 

''ఏజెన్సీలో ఉపాధ్యాయులకు ఉద్యోగాలు చంద్రబాబు కాపాడితే  జీవో నెం. 3 ద్వారా కాపాడుకోలేకపోయింది మీరు కాదా? 4 లక్షల మంది వైసీపీ కార్యకర్తలకు రూ.4వేల కోట్ల ప్రజాధనం దోచిపెడుతూ 7 లక్షల మందికి నిరుద్యోగ భృతిని రద్దు చేసింది మీరు కాదా? కాపులకు 5 శాతం రిజర్వేషన్, అన్నా క్యాంటీన్లు, చంద్రన్న బీమాలు రద్దు చేసింది మీరు కాదా? కేవలం ఏడాది పాలనలో చేసిన అభివృద్ధి సూన్యం కాని రూ.87వేల కోట్ల అప్పు చేసింది మీరు కాదా? అదే విధంగా రూ.50వేల కోట్ల ధరలు పెంచింది మీరు కాదా? ఇసుక, మధ్యం, ఇళ్ల పట్టాల పేరుతో వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. ఏడాదిలో అవినీతి, అరాచకం, అబద్దాల ప్రచారం తప్ప జగన్ ప్రభుత్వం సాధించింది ఏందో కన్నబాబు సమాధానం చెప్పాలిసస అని చినరాజప్ప డిమాండ్ చేశారు. 


 

click me!