
ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు సాధారణంగా ఉన్న ఉష్టోగ్రతలు ఇప్పుడు వేగంగా పడిపోయాయి. చలిగాలులు వీస్తుండటంతో అందరూ వణికిపోతున్నారు. మంచు కురుస్తుండటంతో ఉదయం ఏడున్నర వరకు సూర్యుడు కనిపించడం లేదు. దీంతో ఏపీవాసులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
విశాఖపట్నంలో అత్యల్పం..
ఆంధ్రప్రదేశ్ అంతటా చలిగాలులు వీస్తున్నాయి. అన్నిజిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చలి వల్ల ఆ ప్రాంతంలోని వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వారి అధికారిక లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు విశాఖపట్నంలో నమోదయ్యాయి. విశాఖపట్నంలో జీమడుగుల ప్రాంతంలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదే జిల్లాలోని ముంచిగిపుట్టులోని 6.6 డిగ్రీలు, జీకేవీధిలో 7.2 డిగ్రీలు, డంబ్రీగూడలో 7.4 డిగ్రీలు, అరకులో 7.6 డిగ్రీలు, పెదబయలులో 7.8 డిగ్రీలు, చింతపల్లె ఏఆర్ఎస్‌లో 9.1, హుకుంపేటలో 9.4 డిగ్రీలు, కాకరపాడులో 13.0, పాడేరులో 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయనగరం లెవిడిలో 10.4 డిగ్రీలు, రాస్తకుంటబాయి 10.5 డిగ్రీలు, జీయ్యమవలసలో 10.7 డిగ్రీలు, కురుపం 11.5 డిగ్రీలు, సలూర్‌లో 11.9 డిగ్రీలు, కోమరదలో 12.3, పార్వతిపురం 12.7, మక్కువ 12.8, పినపెంకిలో 13.0, ఈస్ట్ గోదావరి జిల్లాలోని మారెడుమిల్లిలో 11.6, వైరామవరం 12.6 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఏఆర్ఎస్ 11.8, కొత్తూరు 11.9 డిగ్రీలు, భామిని 11.0, హరిపురంలో 12.5, రాజపురం 12.6, బాతుపురంలో (అప్పర్) 13.0, కర్నూల్ లోని కమ్మరచెడు 12.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇటు రాయలసీమ ప్రాంతంలోనూ చలి తీవ్రత బాగానే ఉంది. ఇక్కడ కూడా గాలిలో తేమ శాతం పెరుగుతోంది. పొగమంచు కురుస్తుండటంతో ఉదయం పూట వాహనరాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తెలంగాణలోనూ పెరిగిన చలి..
తెలంగాణ జిల్లాలోను చలి పెరిగింది. రోజూ చల్లగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, జగిత్యాల వంటి ప్రాంతంలో చలి ఎక్కవవుతోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలను పొగమంచు కప్పేస్తోంది. పొదయం 5 గంటల నుంచే చల్లగాలులు వీస్తున్నాయి. ఉదయం పూట 8 గంటల వరకు పొగమంచు ఉండటంతో వాహనరాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.
హైదరాబాద్ లో పెరిగిన చలి.. మరింత పెరిగే ఛాన్స్..వాతావరణ శాఖ హెచ్చరిక...
ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి..
రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చలి నుంచి కాపాడే దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఉదయం సాయంత్రం సమయంలో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని చెబుతున్నారు. అత్యవసరమైతే ముక్కు, చెవిలోకి చల్లగాలి ప్రవేశించకుండా ఉండే దుస్తులు తొడుక్కోవాలని సూచిస్తున్నారు. అస్తమా, దమ్ము, మిగితా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. ఉదయం సమయంలో గోరు వెచ్చని నీరు తాగితే ఈ చలి ప్రభావం వల్ల ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుంచి కొంత ఉపషమనం లభిస్తుందని చెబుతున్నారు. వేడి వేడి ఆహారం తీసుకోవాలని, చల్లటి నీటికి, కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు పొగమంచు వ్యాపించి ఉన్న సమయంలో బయటకు వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు.