
బద్వేల్ నియోజకవర్గంలో వైసీపీ విజయం ప్రజా విజయం అని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి (Gadikota Srikanth Reddy) అన్నారు. వైసీపీ ప్రజలను నమ్ముకున్న పార్టీ అని చెప్పారు. సంక్షేమ పాలనకే ప్రజలు పట్టం కట్టారని అన్నారు. సీఎం జగన్ (YS Jagan) నాయకత్వానికి, వైసీపీకి పెద్ద ఎత్తున మద్దతిచ్చినందుకు ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బద్వేల్‌లో వైసీపీ అభ్యర్థి దాసరి సుధ విజయం సాధించిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ సంక్షేమం పాలన వల్ల తాము గడప గడపకు వెళ్లి ఓట్లు అడిగగాలమని చెప్పారు. ప్రజా తీర్పును గౌరవించాలని, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం మానుకోవాలని ప్రతిపక్షాలను కోరారు. ఈ విజయంతో తమపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా.. బీజేపీ వెనకాల నుంచి మొత్తం నడిపించిందని ఆరోపించారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘గత రెండున్నరేళ్లుగా సంక్షేమ పథకాలపై ప్రతిపక్ష పార్టీలు అనేక నిందలు మోపుతున్నాయి. బీజేపీ పైకి పోటీ చేసిన మొత్తం వెనకాల నుంచి నడిపించింది టీడీపీ అని అందరికి తెలిసిందే. వైసీపీ ఎప్పుడూ ప్రజలనే నమ్ముకుంటుంది. అక్కడ చెప్పిన కార్యక్రమాలు అన్ని అమలు చేస్తాం. ఈ విజయం దళితుల, బడుగు, బలహీన వర్గాలు, సామాన్యుల విజయం. సంప్రదాయం ప్రకారం పోటీ చేయమని చెప్పిన టీడీపీ.. వెనకాల నుంచి బీజేపీకి సపోర్ట్ చేసింది. చంద్రబాబు.. గుంటూరు, విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. ఆ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయారు. ఒడిపోతే వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను సపోర్ట్ చేసినట్టేనన్నా చంద్రబాబు.. ప్రజా తీర్పు తర్వాత ఎదురుదాడి చేశారు.
Also read: Badvel Bypoll Result 2021: బద్వేల్ లో వైసిపి ఘన విజయం... ఎమ్మెల్యేగా మారిన డాక్టర్ సుధ ..
జగన్‌కు పెరుగుతున్న ఆదరణ చూసి.. ప్రజల్లో అభద్రత భావం కలగజేసేందుకు 24 గంటలు టీడీపీ ప్రయత్నిస్తూనే ఉంది. సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినసారి.. ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి అడుగుతూనే ఉన్నారు. చంద్రబాబు లాగా రాష్ట్రాన్ని తాకట్టు పెట్టలేదు. బీజేపీ ఇప్పటికైన ప్రజల మనోభావాన్ని తెలుసుకోవాలి. ప్రజలు ఎందుకు సపోర్ట్ చేయలేదో బీజేపీ ఆలోచన చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలి.
పవన్ కల్యాన్ ఇష్టానుసారం మాట్లాడతారు. పవన్ మాటల్లో క్లారిటీ లేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉందని పవన్ కల్యాన్ చెప్పడం వెనక ఆయన ఉద్దేశం ఏమిటి..?. బీజేపీతో కలిసి పోటీ చేస్తామని చెప్పిన పవన్.. వారి వద్ద నుంచి ఏమి వాగ్దానం తీసుకుంటున్నారు..?. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ ఎంపీలు ప్రతి రోజు నిరసన తెలిపారు’అని చెప్పారు. ఇక, బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి దాసరి సుధ భారీ విజయం సాధించారు. 90 వేలకు పైగా మెజారిటీ ఆమె విజయం సొంతం చేసుకున్నారు.