
అమరావతి: చంద్రబాబు నాయుడు పంద్రాగస్టు విశాఖపట్నంలో ఓ కార్యక్రమం చేపట్టారు. అందులో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూనే భవిష్యత్ పై ఒక దార్శనికత ఉండాలని అన్నారు. భవిష్యత్తుపై ప్రణాళిక ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రపంచంలో పది మంది అత్యున్నత సంపన్నుల్లో ఐదుగురు యూదులేనని, తెలుగు జాతి కూడా ఆ స్థాయికి ఎదగాలన్నదే తన కోరిక అని చంద్రబాబు తెలిపారు.
విశాఖలోని ఎంజీఎం గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఇండియా విజన్ 2047 డాక్యుమెంట్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. భవిష్యత్తు ప్రణాళిక లేకుంటే వ్యక్తిత్వ వికాసం అసాధ్యమని వివరించారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులకు ఒక విజన్ ఉండాలని, అలాంటి వారి పిల్లలే ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని పేర్కొన్నారు.
2047లో భారత్ వందో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుందని చంద్రబాబు నాయుడు అన్నారు. వందేళ్ల ల్యాండ్ మార్క్‌కు వెళ్లుతున్న సందర్భంలో అప్పటికల్లా ఏం చేస్తే మంచి ఫలితాలు వస్తాయో ఆలోచనలు చేయాలని తెలిపారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లో భారతీయులు ఉన్నారని, తమ భారత దేశం ప్రపంచంలోనే అగ్రస్థానానికి వెళ్లాలని కోరుకోవాలని వివరించారు. 90ల్లో వచ్చిన ఇంటర్నెట్ రివల్యూషన్ కారణంగా ప్రపంచంలోనే అనేక అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని చంద్రబాబు అన్నారు. 21వ శతాబ్దం మనదేనని, అందులో ఏ అనుమానం లేదని తెలిపారు.
Also Read : ఆంధ్ర ప్రదేశ్ రాజ్ భవన్‌లో ఎట్ హోం .. హాజరైన సీఎం జగన్ దంపతులు, చంద్ర బాబు దూరం
విశాఖ మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం అని చంద్రబాబు అన్నారు. తాను ఎంతో ఇష్టపడే నగరం అని, తనను అమితంగా ఇష్టపడే నగరంగా చెప్పారు. దేశంలోనే బెస్ట్ సిటీగా విశాఖ ఉన్నదని, ఇప్పుడు ఎవరు రిటైర్‌మెంట్ అయ్యాక నివసించాలనే నగరం గురించి ఆలోచిస్తే విశాఖను ఎంచుకుంటారని వివరించారు. విజన్ 2047 డాక్యుమెంట్ కేవలం డ్రాఫ్ట్ మాత్రమేనని, దీనిపై మేధావులు చర్చించాలని చంద్రబాబు నాయుడు వేదిక మీది నుంచి కోరారు.