గోరంట్ల మాధవ్‌కు ఎంపీ టికెట్ ఎందుకొచ్చిందంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Aug 15, 2023, 9:01 PM IST
Highlights

తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డిని తిట్టినందుకే గోరంట్ల మాధవ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి. టీడీపీలో నేతలు లేరని.. కానీ కార్యకర్తలు మాత్రం వున్నారని జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు జేసీ దివాకర్ రెడ్డిని తిట్టినందుకే గోరంట్ల మాధవ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎంపీ టికెట్ ఇచ్చారని అన్నారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇసుక దందాకు పాల్పడుతున్నారని.. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడని పక్షంలో తామే ఇసుకను తోలుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇక సొంతపార్టీపైనా ప్రభాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీలో నేతలు లేరని.. కానీ కార్యకర్తలు మాత్రం వున్నారని జేసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇకపోతే.. జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో నడుస్తోన్న దివాకర్ ట్రావెల్స్ BS3 వాహనాలను BS4గా మార్చి నడుపుతున్నారనే అభియోగాలపై స్పందించిన న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. 2020 అక్టోబర్ 12న తెలంగాణ రవాణా శాఖకు ఈ విషయంపై తాను పలుమార్లు ఫిర్యాదు చేశానని పిటిషన్‌దారుడు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పేర్కొన్నారు.

ALso Read: జేసీ ప్రభాకర్ రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ నోటీసులు.. మళ్లీ తెరపైకి ఆ కేసు

తెలంగాణలో బస్సులను అక్రమంగా నడుపుతున్నారని.. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలు ధిక్కరించడమేనని ఆయన పిటిషన్‌లో వివరించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. కౌంటర్ దాఖలు చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమీషనర్, డీజీపీ, సీబీఐలకు నోటీసులు జారీ చేసింది.   

click me!