ఎక్స్‌గ్రేషియా ఎవరికిచ్చారు.. ఎందుకీ తప్పుడు మాటలు, మా బిడ్డ విలువ 10 లక్షలా : టీటీడీపై లక్షిత తాత వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Aug 15, 2023, 09:34 PM IST
ఎక్స్‌గ్రేషియా ఎవరికిచ్చారు.. ఎందుకీ తప్పుడు మాటలు, మా బిడ్డ విలువ 10 లక్షలా : టీటీడీపై లక్షిత తాత వ్యాఖ్యలు

సారాంశం

తిరుమల అలిపిరి మెట్ల దారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత తాత శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పాప ప్రాణం ఖరీదును రూ.10 లక్షలుగా నిర్ణయించారని.. అయినా మాకు ఎవరి సాయం అక్కర్లేదని శ్రీనివాసులు తేల్చిచెప్పారు. 

తిరుమల అలిపిరి మెట్ల దారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత తాత శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన మనవరాలు చిరుత దాడిలో మరణిస్తే అటవీ శాఖ, టీటీడీ తప్పు లేదని ఈవో ధర్మారెడ్డి చెబుతున్నారని మండిపడ్డారు. తమ కుటుంబానికి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇచ్చినట్లు చెబుతున్నారని .. దానిని ఎవరికిచ్చారని శ్రీనివాసులు ప్రశ్నించారు. ఎందుకు ఇలాంటి తప్పుడు మాటలు చెబుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  మా పాప ప్రాణం ఖరీదును రూ.10 లక్షలుగా నిర్ణయించారని.. అయినా మాకు ఎవరి సాయం అక్కర్లేదని శ్రీనివాసులు తేల్చిచెప్పారు. 

జింకలకు ఇచ్చే రక్షణ మనుషులకు లేదని.. జింకలను స్వేచ్ఛగా వదిలితేనే చిరుతలు, పులులు మనుషుల వైపు రావని ఆయన పేర్కొన్నారు. జింకలను ఎందుకు బంధిస్తున్నారని శ్రీనివాసులు ప్రశ్నించారు. పులి సంచారం వున్నట్లు పత్రికల్లో వస్తున్నా.. చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు. కంచ వేసి వుంటే తమ బిడ్డ ప్రాణాలతో వుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని శ్రీనివాసులు కోరారు. నాయకులు వస్తే భద్రత కల్పిస్తారని.. కానీ మా లాంటి వాళ్ల ప్రాణాలకు రక్షణ వుండదా అని ఆయన నిలదీశారు.   

Also Read: తిరుమల నడకదారుల్లో చిన్నపిల్లలకు అనుమతిపై ఆంక్షలు.. ఆ తర్వాత నో ఎంట్రీ.. చేతులకు ట్యాగ్‌లు..

కాగా.. అలిపిరి కాలినడక మార్గం శుక్రవారం రాత్రి ఆరేళ్ల బాలిక లక్షితపై చిరుతపులి దాడి చేయడం తీవ్ర విషాదాన్ని మిగిలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అటవీ, పోలీసు శాఖలతో కలిసి కాలినడక మార్గంలోని అన్ని ప్రాంతాలలో భద్రతను కట్టుదిట్టం చేసింది. శిక్షణ పొందిన సిబ్బందితో పాటు అటవీ శాఖ ఇప్పటికే 24X7 ప్రాతిపదికన రెండు బోనులను సిద్ధంగా ఉంచినట్లు టీటీడీ కార్యనిర్వహణాధికారి (ఈవో) ఏవీ ధర్మారెడ్డి తెలిపారు.

అంతేకాకుండా ఈ మార్గంలో గాలి గోపురం పాయింట్ నుంచి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వరకు దాదాపు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. మరోవైపు తిరుమలకు కాలినడక మార్గంలో పిల్లలతో కలిసి వెళ్తున్న తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇక, అటవీశాఖ అధికారుల నుంచి నివేదిక అందిన తర్వాత టీటీడీ మరిన్ని చర్యలు తీసుకోనుంది. 

అంతేకాకుండా.. తిరుమల అలిపిరి, శ్రీవారిమెట్టు నడకదారుల్లో పిల్లల అనుమతిపై టీటీడీ ఆంక్షలు విధించింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్ల లోపు పిల్లలకు అనుమతి నిలిపివేస్తున్నట్టుగా తెలిపింది. అంతేకాకుండా నడకదారిలో వెళ్తున్న పిల్లలకు ట్యాగ్‌లు కూడా కడుతున్నారు. కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు మిస్ అయితే.. ఈ ట్యాగ్‌లు వారిని కనిపెట్టేందుకు సహాయపడతాయని చెబుతున్నారు.  పిల్లలకు కట్టే ట్యాగ్‌లో తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నెంబర్, పోలీసులు కంట్రోల్ నెంబర్ రాస్తున్నారు. ఇక, రెండో ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల తర్వాత బైక్‌లకు అనుమతి నిరాకరించినట్టుగా టీటీడీ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

ఆంధ్ర యూనివర్సిటీలో పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Deputy CM Pawan Kalya | Asianet News Telugu
Deputy CM Pawan kalyan: ఆంధ్ర యూనివర్సిటీ పవన్ పంచ్ లకి పడిపడి నవ్విన స్టూడెంట్స్ | Asianet Telugu