ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రకటించిప్పుడే కరోనావైరస్ దృష్ట్యా ఎన్నికలను వాయిదా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. తాజాగా, జగన్ కోరనా గురించి మాట్లాడినప్పటికీ చర్యలను ప్రకటించలేదు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ స్థానిక ఎన్నికల తేదీలను ప్రకటించినప్పుడే తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు కరోనా వైరస్ గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన కోరారు. దాన్ని బిజెపి నాయకుడొకరు తప్పు పట్టారు కూడా. కరోనా వైరస్ పేరు చెప్పి చంద్రబాబు చేతులెత్తేస్తున్నారని ఆయన అన్నారు.
కరోనావైరస్ ముప్పును చూపించే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిలిపేశారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నేపథ్యంలో ఆయన ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. కరోనావైరస్ వ్యాపించకుండా ప్రపంచ వ్యాప్తంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకుంటున్నాయి.
Also Read: ఈసీ నిమ్మగడ్డకు చంద్రబాబు వైరస్, అందుకే వాయిదా: పేర్ని నాని
ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రమైన తెలంగాణలో పాఠశాలలను మూసేశారు. సామూహిక కార్యక్రమాలను నిషేధించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం కరోనా వైరస్ గురించి మాట్లాడారే గానీ ఏ విధమైన ముందు జాగ్రత్త చర్యలను కూడా ప్రకటించలేదు. పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని చెప్పారు.
ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలు, ఇతర సంస్థల మూసివేతను ప్రకటించకపోవడం, సామూహిక కార్యక్రమాలను రద్దు చేయకపోవడం వెనక రాజకీయ కారణం ఉందని భావిస్తున్నారు. కరోనా వైరస్ కారణం చూపించి ఈసీ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసింది. తాను కూడా ముందు జాగ్రత్త చర్యలు ప్రకటిస్తే తానే ఈసీ నిర్ణయాన్ని బలపరిచిట్లు అవుతుందని జగన్ భావించి ఉండవచ్చు.
Also Read: అదే సామాజిక వర్గం, రమేష్ కుమార్ వెనక చంద్రబాబు: జగన్
కరోనా వైరస్ రాష్ట్రంలో లేదని, ఎన్నికలను వాయిదా వేయాల్సిన అవసరం లేదని జగన్ చెప్పదలుచుకున్నారు. అందుకే ఆయన ముందు జాగ్రత్త చర్యలు ప్రకటించలేదని అంటున్నారు. చంద్రబాబు మాత్రం కరోనావైరస్ బెడద గురించి గట్టిగానే మాట్లాడుతున్నారు. ఈసీపై జగన్ చేసిన ప్రకటనకు ఆయన దాన్ని చూపించే కౌంటర్ ఇచ్చారు.