నేను అలా అనలేదు: చంద్రబాబు యూటర్న్

First Published Apr 27, 2018, 10:02 PM IST
Highlights

తనకు రక్షణకవచంగా ఉండాలని ప్రజలకు చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

అమరావతి: తనకు రక్షణకవచంగా ఉండాలని ప్రజలకు చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తనకు రక్షణకవచంగా ఉండాలని ప్రజలకు తాను పిలుపునిచ్చినట్లు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. ఎపికి రక్షకవచంగా ఉండాలని మాత్రమే తాను పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. 

తనపై ఏ విధమైన కేసులు లేవని, తానెవరికీ భయపడబోనని, తనను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కోర్టుకు వెళ్లేవారు తనను విమర్శించడం దారుణమని ఆయన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను ఉద్దేశించి అన్నారు. 

ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో 89 శాతం అమలు చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో కాంగ్రెసు పాలనలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూసి పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. తాను పాదయాత్ర చేసే సమయంలో రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. కాంగ్రెసు హయాంలో రైతు ఆత్మహత్యలు, క్రాప్ హాలీడేలు, కరెంట్ కోతలు, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని చెప్పారు. 

అప్పుడు పవిత్ర భావనతో వస్తున్నా.. మీకోసం పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. పాదయాత్రను హిందూపురంలో ప్రారంభించి విశాఖలో ముగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ఆయన వివరిచారు. 

ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద యెత్తున కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. పులివెందులకు నీళ్లు ఇచ్చిన ఘనత తమదేనని అన్నారు.  

click me!