ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిజెపి ప్రచారం: చంద్రబాబుకు షాక్

First Published Mar 6, 2018, 9:52 AM IST
Highlights
  • మూడేళ్ళ పాలనలోని లొసుగులను, చంద్రబాబునాయుడు అవినీతిని, ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం చిత్తశుద్దిని ప్రజలకు వివరించాలని నిర్ణయించింది.

తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని బిజెపి నిర్ణయించింది. మూడేళ్ళ పాలనలోని లొసుగులను, చంద్రబాబునాయుడు అవినీతిని, ఏపి ప్రయోజనాల విషయంలో కేంద్రం చిత్తశుద్దిని ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. మంగళవారం మధ్యాహ్నం విజయవాడలోని ఎయిమ్స్ ప్రాంతం నుండి పర్యటన మొదలుపెట్టాలని బిజెపి ప్రకటించటం చంద్రబాబుకు పెద్ద షాక్ కొట్టినట్లైంది.

ఇదే విషయాన్ని బిజెపి మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎంఎల్ఏలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, ఎంఎల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, ఏపికి కేంద్రం చేసిన మేళ్ళ గురించి వివరిస్తామన్నారు. అదే విధంగా వివిధ ప్రాజెక్టుల వద్ద పర్యటించి జరిగిన వాస్తవాలను వివరిస్తామన్నారు. అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ. 1100 సరిపోయేదానికి ప్రభుత్వం రూ. 11 వేలు చెల్లించిన విషయాన్ని కూడా వివరిస్తామని చెప్పటం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించేదే.

విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోతే బిజెపి నేతలను జనాలు బట్టలూడదీసి కొడతారన్న టిడిపి నేత ముళ్ళపూడి రేణుక వ్యాఖ్యలపై నేతలు మండిపడ్డారు. మూడున్నరేళ్ళ కాలంలో జరిగిన అవినీతిని వివరిస్తే ప్రభుత్వాన్ని, టిడిపి నేతలనే జనాలు బట్టలూడదీసి కొడతారంటూ మండిపడ్డారు. బిజెపికి వ్యతిరేకంగా టిడిపి నేతలు పెడుతున్న ఫ్లెక్సీలు చంద్రబాబుకు తెలీకుండానే ఏర్పాటవుతున్నాయా? అంటూ ధ్వజమెత్తారు.

మొత్తం మీద మిత్రపక్షాల మధ్య అగ్గి బాగానే రాజుకుంటోంది. అటు అసెంబ్లీ, కౌన్సిల్లోనే కాకుండా చివరకు చంద్రబాబుకు వ్యతరేకంగా రాష్ట్రంలో పర్యటించేదాకా పరిస్ధితి దిగజారిపోయింది. మరి మిత్రపక్షాల మధ్య సంబంధాలను జనాలు ఏ విధంగా చూస్తున్నారో కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

 

click me!