టిడిపిలో దళితులకు గౌరవం లేదు..రావెల సంచలనం

First Published Mar 5, 2018, 5:26 PM IST
Highlights
  • దళితుల ఆత్మగౌరవం గురించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతోంది.

వరుసపెట్టి మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు టిడిపిపై బాంబులు వేస్తూనే ఉన్నారు. మొన్నటికిమొన్న జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్ గురించి మాట్లాడిన రావెల తాజాగా దళితుల ఆత్మగౌరవం గురించి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతోంది. ఇంతకీ రావెల ఏమన్నారంటే, టీడీపీలో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని మండిపడ్డారు.  

తెలుగుదేశం పార్టీలోని దళిత ప్రజాప్రతినిధులకు పదవులు తప్ప అధికారం లేదని అన్నారు. ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ‘పదవులు మావి పెత్తనం మాత్రం వాళ్లదా?’ అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని వాపోయారు.

తెలుగుదేశం పార్టీలో ఉన్న దళిత ప్రజాప్రతినిధులందరి  పరిస్దితి ఇదే విధంగా ఉన్నారు. అందుకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్పారు.  రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల (కమ్మ) నేతల పెత్తనమే ఎక్కువగా ఉందన్నారు. అధికారం చెలాయించేది మాత్రం బయటి వ్యక్తులే అని మండిపడ్డారు. కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని నామమాత్రపు ఎమ్మెల్యేగా చూస్తున్నారు. పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్థన్‌రెడ్డి సాగిస్తున్నారట.

కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎక్సైజ్‌ మంత్రి జవహర్ అయినప్పటికీ పెత్తనం మొత్తం సుబ్బరాజు చౌదరిదట. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావైతే అధికారం మొత్తం అక్కడి చైర్మన్‌ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉందట. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిదైతే అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన అని ధ్వజమెత్తారు.

కేవలం నామమాత్రపు నాయకత్వాన్ని ఇచ్చి అధికారం పక్కవాళ్లు చెలాయిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు చదువుకున్నవారు, విజ్ఞానవంతులు అంబేడ్కర్‌వాదులు రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. వీరు అగ్రకుల ఆధిపత్యాన్ని సహించే పరిస్థితుల్లో లేరని చెప్పారు. వీరికి పదవులతోపాటు అధికారం కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పుడే ఈ పార్టీలో తమకు గుర్తింపు, గౌరవం, అధికారం ఉంది అనే ఆత్మవిశ్వాసంతో వారు పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పారు. మొత్తం మీద రావెల రోజుకో సంచలనం రేపుతున్నారు.


 

 

click me!