పోలీసు స్టేషన్లు తిప్పి వేధించారు: నలంద కిశోర్ మృతిపై చంద్రబాబు

By telugu teamFirst Published Jul 25, 2020, 2:27 PM IST
Highlights

నలంద కిశోర్ మృతిపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పోలీసుల వేధింపులతో మనస్తాపానికి గురై నలంద కిశోర్ మరణించారని చంద్రబాబు ఆరోపించారు.

హైదరాబాద్: విశాఖపట్నం నగరానికి చెందిన నలంద కిషోర్ హఠాన్మరణం పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 
వైసిపి తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేకే మనస్తాపంతో మృతి చెందడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వ దుశ్చర్యలను ఖండిస్తున్నానని ఆయన అన్నారు. 

కిషోర్ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశాడనే వంకతో నలంద కిషోర్ పై అక్రమ కేసులు బనాయించారని, వృద్దాప్యంలో ఆయనను అరెస్ట్ చేసి, ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో విశాఖ నుంచి రోడ్డుమార్గంలో అనేక జిల్లాలు దాటించి కర్నూలు తరలించారని ఆయన అన్నారు. 

పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారని, నానారకాలుగా శారీరక,మానసిక హింస పెట్టారని ఆయన అన్నారు. ఈ క్షోభ తట్టుకోలేకే తీవ్ర మనోవేదనకు గురయ్యాడని, 
నలంద కిషోర్ మరణానికి వైసిపి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు.

Also Read: నలంద కిశోర్ మృతి: వైఎస్ జగన్ మీద విరుచుకుపడిన రఘురామ కృష్ణమ రాజు

సోషల్ మీడియాలో మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నలంద కిశోర్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్ మీద విడుదలయ్యారు. ఆయన శనివారం ఉదయం మరణించారు. నలంద కిశోర్ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు సన్నిహిత మిత్రుడు.

click me!