కరోనాపై ప్రభుత్వానివన్నీ కాకిలెక్కలే... ఆధారాలివే: టిడిపి ఎమ్మెల్యే డోలా

By Arun Kumar PFirst Published Jul 25, 2020, 1:16 PM IST
Highlights

కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలని టిడిపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆరోపించారు. 

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే కరోనాకేసులు 80వేలను మించిపోయాయని... రోజుకు 8వేల పైచిలుకు కేసులు నమోదవుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి ఆక్షేపించారు. 

శనివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలన్న ఆయన... కరోనా పెద్ద జబ్బేమీ కాదని, అది వస్తుంది..పోతుందని, పారాసిట్మాల్, బ్లీచింగ్ పౌడర్ తో దాన్నితరిమివేయవచ్చని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి తన అజ్ఞానాన్ని చాటుకున్నాడన్నా రు. ఆయన అసమర్థతను బలపరుస్తూ హోం మంత్రి సుచరిత నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. 

ప్రభుత్వం చెబుతున్న కరోనా గణాంకాలు జిల్లాస్థాయిలో ఒకలాఉంటే, రాష్ట్రస్థాయిలో మరోలా ఉంటున్నాయన్నారు. ప్రకాశం జిల్లాలో 22 వతేదీన 177 కేసులు నమోదైనట్లు దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,433 అని రాష్ర్ట అధికారులు చెబితే...జిల్లా యంత్రాంగం మాత్రం అదేరోజున140 పాజిటివ్ కేసులు నమోదైతే మొత్తం కేసులు 2946 అని చెప్పడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లావ్యాప్తంగా పాడైన శాంపిల్స్ సంఖ్య 27వేలని కలెక్టర్ చెబితే రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మాత్రం కేవలం 3,777గా చెప్పడం జరిగిందన్నారు. ఈవిధంగా సంబంధం లేకుండా కాకిలెక్కలతో ప్రజలజీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీడీపీ ఎమ్మెల్యే మండిపడ్డారు. 

read more   కరోనా సోకిందంటూ గేలి.. తట్టుకోలేక

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 933 మంది చనిపోయారన్నారు. తమ ఇంట్లో, తమ వీధిలో పాజిటివ్ వచ్చిందని ప్రజలు గగ్గోలుపెడుతున్నా, అధికారులు కిట్లు లేవనిచెప్పి తప్పించుకుంటున్నారన్నారు. ఒకఇంట్లో ఒకరి శాంపిల్ తీసుకుంటే వాటి తాలూకా ఫలితం వచ్చే వరకు మరొకరికి పరీక్ష చేయమని చెబుతున్నారని...  దానివల్ల కేసులసంఖ్య  పెరగక ఎలా తగ్గుతుందన్నారు. సరైన వైద్య పరికరాలు, పీపీఈకిట్లు లేక పోలీస్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, వైద్యులు, నర్సులు, విలేకరులు చనిపోయారని డోలా ఆవేదన వ్యక్తంచేశారు. 

మంత్రులు, ఉపముఖ్యమంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి వైద్యం చేయించుకోవాలని... ఆప్పుడే ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుందని  సూచించారు. ఐఏఎస్ ల పెత్తనాన్ని తట్టుకోలేకపోతున్నామని వైద్యఆరోగ్యశాఖసిబ్బంది వాపోతున్నారని... వారిమధ్య ఉన్న కలహాల కారణంగా ప్రజలు బలవుతున్నారన్నారు. 

కరోనా మరణాలు, వ్యాప్తిలో రాష్ట్రం ముందంజలో ఉండటం బాధాకరమన్నారు ఎమ్మెల్యే వీరాంజనేయస్వామి. ప్రభుత్వం విఫలమైనందున ప్రజలే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏపీ అంటే పారాసిట్మాల్, బ్లీచింగ్ తో కరోనా నయం చేసే రాష్ట్రమని విదేశాల్లో హేళన చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వెంటిలేటర్లు, పడకలు లేక రోగులు నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. కరోనా మరణాలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి కాబట్టి అవన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందని డోలా మరోసారి స్పష్టంచేశారు.
 

click me!