అసెంబ్లీ చరిత్రలో నేడు చీకటి రోజు.. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా జగన్ నిలిచిపోతారు: చంద్రబాబు

By Sumanth KanukulaFirst Published Mar 20, 2023, 11:35 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజని అన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసెంబ్లీ చరిత్రలో ఇది ఒక చీకటి రోజని అన్నారు. రాష్ట్ర చరిత్రలో శాసనసభలో ఎమ్మెల్యేపై దాడి ఎప్పుడూ లేదని అన్నారు. సీఎం జగన్ ప్రోద్బలంతోనే దళిత సభ్యుడైన వీరాంజనేయస్వామిపై దాడి జరిగిందని ఆరోపించారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సీఎంగా  జగన్ నిలిచిపోతారని విమర్శించారు. ఇది శాసనసభ కాదని.. కౌరవ సభ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చూసి సీఎం జగన్‌కు పిచ్చిక్కెందని విమర్శించారు. వైసీపీ  సిద్దాంతం ఏమిటో ప్రజలకు పూర్తిగా అర్థమైందని అన్నారు. 

ఇదే విషయంపై ట్విట్టర్‌లో కూడా చంద్రబాబు పోస్టు చేశారు. ‘‘అసెంబ్లీలో మా ఎమ్మెల్యే డాక్టర్ డోల స్వామిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు దాడి చేయడం చూసి షాక్ అయ్యాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కి బ్లాక్ డే ఎందుకంటే ఇంత అవమానకరమైన సంఘటన అసెంబ్లీలోని పవిత్రమైన హాల్లో గతంలో ఎప్పుడూ జరగలేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లీన్‌స్వీప్‌ చేసిన నేపథ్యంలో ఇది పథకం ప్రకారం జరిగిన దాడిలా కనిపిస్తోంది. ఈ దుర్మార్గపు చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వైఎస్సార్‌సీపీ నేతలను వెంటనే సస్పెండ్ చేయాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు. 

Also Read: ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ.. కొట్టుకున్న ఎమ్మెల్యేలు..!!

ఇక, ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఈరోజు వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ పరిణామాలపై టీడీపీ సభ్యులు అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడారు. వైసీపీ సభ్యులు శాసనసభ పరువు తీస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్ వద్ద మేం నిరసన వ్యక్తం చేస్తున్నా వైసీపీ సభ్యులు వస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమ సభ్యులపై దాడి చేశారని ఆరోపించారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి తోసేశారని చెప్పారు. డోలా బాలావీరాంజనేయస్వామిపై సుధాకర్ బాబు, ఎలీజా దాడి చేశారని తెలిపారు. 

Also Read: ఏపీ అసెంబ్లీలో తీవ్ర ఉద్రిక్తత.. 11 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు..

స్పీకర్ దగ్గర మినిట్ టూ మినిట్ వీడియో ఉందని అన్నారు. సభలో రికార్డు అయిన వీడియోను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తాము తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకోవాలని అన్నారు. తమ సభ్యులు దాడి చేసినట్టుగా తేలితే చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ సభ్యులపై పథకం ప్రకారమే వైసీపీ సభ్యులు దాడి చేశారని ఆరోపించారు. తమపై దాడి చేసిందే కాకుండా.. తిరిగి తమపైనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. స్పీకర్‌పై తాము దాడి చేసినట్టుగా అసత్యాలు చెబుతున్నారని అన్నారు.  

click me!