Chandrababu Naidu: రాజ‌ధాని మార్పు వ్యాఖ్య‌ల‌పై స్పందించిన చంద్ర‌బాబు.. ఏమ‌న్నారంటే.?

Published : Jul 02, 2026, 02:25 PM IST
Chandrababu Naidu

సారాంశం

Chandrababu Naidu: వచ్చే ఎన్నికల్లో మావిగన్ రాజధానిని అజెండాగా మారుస్తామని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చకు తెర తీసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశంపై ఏపీ సీఎం స్పందించారు. 

తిరుపతిలో వీబీజీ రామ్‌జీ ప‌థ‌కం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కొత్త దిశగా అడుగులు వేస్తున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, మౌలిక వసతుల విస్తరణ లక్ష్యంగా ప్రారంభించిన వికసిత్ భారత్ గ్రీన్ – రాష్ట్రీయ గ్రామీణ మౌలిక సదుపాయాలు (VBG RAM-G) పథకం రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించారు.

రాయలసీమ నుంచే మరో చారిత్రక పథకం ప్రారంభం

సభలో మాట్లాడిన చంద్రబాబు, గతంలో ఉపాధి హామీ పథకం (నరేగా) కూడా రాయలసీమ నుంచే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు కానున్న VBG RAM-G పథకం కూడా ఇదే ప్రాంతం నుంచి ప్రారంభం కావడం ప్రత్యేకత అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు.

రూ.11,700 కోట్లతో అభివృద్ధి పనులు

ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.7,700 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.4,000 కోట్లు వెచ్చించనున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ నిధులతో గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీలు, కాలువలు, పొలాలకు వెళ్లే రహదారులు వంటి కీలక పనులు చేపడతామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, గ్రామీణాభివృద్ధికి ఇది పెద్ద మద్ధతు అవుతుందని తెలిపారు. పనుల్లో పారదర్శకత కోసం జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ విధానాలను తప్పనిసరిగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

అమరావతి, పోలవరంపై స్పష్టమైన ప్రకటన

రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం వేగంగా కొనసాగుతుందని, దాన్ని నిలిపివేయడం ఎవరి వల్ల కాదని చెప్పారు. వైసీపీతో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆ పార్టీ రోజుకో మాట మాట్లాడుతోందన్నారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి అన్నారని, అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలాట ఆడారని, ఇప్పుడు ఎన్నికల్లో ఓడాక మావిగన్ అంటున్నారని చంద్రబాబు ఆక్షేపించారు. మన రాజధాని అమరావతే అని చంద్రబాబు తేల్చేశారు. అది దేవతల రాజధాని అని గుర్తుచేశారు.

అలాగే పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి దేశానికి అంకితం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించడంలో పురోగతి సాధించామని, రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు గూగుల్ డేటా సెంటర్, తిరుపతిలో బుల్లెట్ మోటార్ సైకిల్ తయారీ యూనిట్ వంటి భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని వెల్లడించారు.

రాయలసీమ అభివృద్ధికి కొత్త కార్యాచరణ

రాయలసీమను అన్ని రంగాల్లో ముందంజలో నిలపడం ప్రభుత్వ లక్ష్యమని సీఎం తెలిపారు. మదనపల్లిలో త్వరలో హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు. తోతాపురి మామిడి రైతులకు సహాయం అందించడంతో పాటు గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్రం సహకరించినందుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేస్తున్నామని, 'వికసిత్ భారత్ – స్వర్ణాంధ్ర' లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పారు. ఈ లక్ష్య సాధనలో ప్రజల సహకారం ఎంతో అవసరం అని ఆయన పిలుపునిచ్చారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పెద్ద కొడుకులా ఇంటింటికీ బాబు.. నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో సీఎం చంద్రబాబు | Asianet Telugu
Pawan Kalyan Health Update: చికిత్స కోసం ముంబై వెళ్లిన పవన్ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?