KIMS Hospital : ఒకటి రెండు కాదు మూడుసార్లు గుండె ఆగింది.. అయినా ప్రాణాలతో బయటపడ్డ మహిళ

Published : Apr 10, 2026, 02:40 PM IST
KIMS

సారాంశం

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు గుండె ఆగిపోయింది… అయినప్పటికీ ఆ మహిళ ప్రాణాలు కాపాడారు కిమ్స్ వైద్యులు. ఈ ఘటనతో విశాఖపట్నం కిమ్స్ హాస్పిటల్, అక్కడి వైద్యులు వార్తల్లో నిలిచారు.

విశాఖపట్నం సీతమ్మధారలోని కిమ్స్ (KIMS) ఆసుపత్రి వైద్యులు అసాధారణమైన ఆపరేషన్ చేశారు. చికిత్స పొందుతున్న సమయంలో మూడుసార్లు కార్డియాక్ అరెస్ట్ కు గురైన 62 ఏళ్ల వృద్ధురాలిని అత్యవసర వైద్యం, నిరంతర పర్యవేక్షణతో ప్రాణాపాయం నుండి తప్పించారు. ఐసీయూ నిపుణులు, మల్టీడిసిప్లినరీ వైద్య బృందం సమన్వయంతో ఈ అరుదైన విజయం సాధ్యమైంది.

ఐసీయూ చీఫ్ డాక్టర్ ఐ. రామకృష్ణ, ఫిజీషియన్ డాక్టర్ బి.వి.ఎన్. రావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నంకు చెందిన ఒక మధుమేహ రోగి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, ఆహారం తీసుకోలేకపోవడం వంటి సమస్యలతో జనవరి 21న ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆసుపత్రికి వచ్చే సమయానికే 'షాక్' స్థితిలో ఉండటంతో వెంటనే 'నొరాడ్రినలిన్' సపోర్ట్ అందించారు.

వైద్య పరీక్షలు :

హిమోగ్లోబిన్ : 6.4 g/dL

క్రియేటినిన్ : 3.2 mg/dL

NT-proBNP : 30,000 కంటే ఎక్కువ

2D ఎకో : గుండె కండరాల కదలికల్లో లోపాలు, ఎజెక్షన్ ఫ్రాక్షన్ (EF) సుమారు 47% గా నమోదైంది.

సుమారు 48 గంటల నిలకడ తర్వాత రక్తపోటు మెరుగుపడటంతో అసలు సమస్యను గుర్తించడానికి వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆమెకు 'వెంట్రిక్యులర్ టాచీకార్డియా' (VT) ఏర్పడి ఒక్కసారిగా గుండె ఆగిపోయింది. వైద్యులు వెంటనే సీపీఆర్ (CPR), డిఫిబ్రిలేషన్ ద్వారా ఆమెను కాపాడారు.

అయితే కష్టాలు అక్కడితో ఆగలేదు. ఐసీయూకి తరలించిన తర్వాత ఆమెకు రెండోసారి కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, అప్పుడు కూడా వైద్యులు ఆమెను కాపాడారు. రెండు రోజుల తర్వాత మూడోసారి కూడా గుండె ఆగిపోగా, ఎమర్జెన్సీ షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చి ఆమె పరిస్థితిని నిలకడగా మార్చారు.

చికిత్సలో సవాళ్లు..

ఇన్నిసార్లు గుండె ఆగిపోయినా సదరు మహిళ స్పృహతో ఉండటం, వైద్యుల సూచనలకు స్పందించడం అసాధారణమని వైద్యులు పేర్కొన్నారు. వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉన్న సమయంలో ఆమెకు కిడ్నీ పనితీరు దెబ్బతినడంతో డయాలసిస్ చేయాల్సి వచ్చింది. అలాగే ఎడమ ఊపిరితిత్తులు కుచించుకుపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.

శ్వాస తీసుకోవడం సులభతరం చేసేందుకు వైద్యులు 'ట్రాకియోస్టమీ' నిర్వహించారు. ఆ తర్వాత శ్వాసకోశ కండరాలకు వ్యాయామం, ఇన్‌ఫెక్షన్ నియంత్రణ చర్యల ద్వారా క్రమంగా ఆమె వెంటిలేటర్ సాయం లేకుండా సొంతంగా శ్వాస తీసుకునేలా చేశారు. పరిస్థితి పూర్తిగా మెరుగుపడిన తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేశారు.

"పట్టుదల, టీమ్ వర్క్, సరైన సమయంలో స్పందించడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ వైద్య సిబ్బంది సానుకూల ఫలితం కోసం కృషి చేశారు" అని వైద్యులు తెలిపారు.

ఈ చికిత్సలో కార్డియాలజిస్ట్ డాక్టర్ మహేష్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు డాక్టర్ చలపతిరావు, డాక్టర్ శ్రీనివాస్, నెఫ్రాలజిస్టులు డాక్టర్ ఆర్.కె. మహేష్, డాక్టర్ చరణ్, పల్మనాలజిస్ట్ డాక్టర్ భరత్, ఈఎన్టీ సర్జన్ డాక్టర్ దిలీప్, న్యూరాలజిస్ట్ డాక్టర్ రోహిత్, ఐసీయూ వైద్యులు డాక్టర్ గంగాధర్, డాక్టర్ కౌసల్య, డాక్టర్ రమ్య, డాక్టర్ మోహన్ సాయి, అనస్థీషియా బృందం పాల్గొన్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News
Pawan Kalyan Pressmeet: ఢిల్లీలో ‘జాతీయ సమైక్యత కోసం.. సేన ప్రస్థానం | Asianet News Telugu