Andhra Pradesh: ఉచిత క‌నెక్ష‌న్లు, భారీ స‌బ్సిడీలు.. క్లీన్ ఎనర్జీ దిశ‌గా ఏపీ అడుగులు

Published : May 16, 2026, 10:26 PM IST
Andhra Pradesh

సారాంశం

Andhra Pradesh: ఏపీలో ఇంధన పొదుపు, పునరుత్పాదక విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పెరుగుతున్న ఇంధన అవసరాలు, విదేశీ దిగుమతులపై ఆధారపడే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సౌరశక్తి వినియోగాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ప్రతి ఇంటిపై సౌర విద్యుత్ లక్ష్యంగా ప్రభుత్వం

సాధారణ ప్రజలు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునేందుకు తమ ఇళ్లపైనే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఉచితంగా సూర్యఘర్ కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం కోటి సూర్యఘర్ కనెక్షన్ల లక్ష్యంతో ముందుకెళ్తుండగా, ఆంధ్రప్రదేశ్ ఒక్క రాష్ట్రంలోనే 20 లక్షల కనెక్షన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది. మొదటి దశలో 6 లక్షల కుటుంబాలకు 2 కిలోవాట్ల సామర్థ్యంతో ఉచిత సోలార్ కనెక్షన్లు అందించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు

భారీ సబ్సిడీలతో ప్రజలకు ఊరట

సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్రం, రాష్ట్రం కలిసి భారీ సబ్సిడీలు అందిస్తున్నాయి. 2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం రూ.60 వేల వరకు, 3 కిలోవాట్లకు రూ.78 వేల వరకు సబ్సిడీ ఇస్తోందని మంత్రి వివరించారు. అదనంగా బీసీ వర్గాలకు మరో రూ.20 వేల ఆర్థిక సహాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు అయితే 2 కిలోవాట్ల సోలార్ యూనిట్‌పై మొత్తం రూ.1.25 లక్షల వరకు సబ్సిడీ ప్రభుత్వం భరించనుంది. ఇలాంటి చర్యల వల్ల సాధారణ కుటుంబాలు విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ భవనాలపై కూడా సోలార్ ప్రాజెక్టులు

ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం తగ్గించేందుకు ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రభుత్వ అవసరాలకు వినియోగించడం వల్ల విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత రెండేళ్లుగా విద్యుత్ బిల్లులు పెంచకుండా అదనపు ఖర్చులను ప్రభుత్వమే భరించిందని మంత్రి పేర్కొన్నారు. అలాగే గతంలో ఏర్పడిన వేల కోట్ల ఆర్థిక భారాన్ని కూడా ప్రజలపై మోపకుండా ప్రభుత్వం నిర్వహించిందని చెప్పారు.

క్లీన్ ఎనర్జీ వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు

భవిష్యత్తులో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం ప్రమాదకరం అని, అందుకే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. సౌరశక్తి, వాయు విద్యుత్ వంటి పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని పెంచి ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు వేగంగా అమలు చేస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడ మంచి విధానాలు ఉన్నా వాటిని తీసుకురావడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తెలిపారు. ప్రభుత్వం మాత్రమే కాదు, ప్రజలు కూడా ఇంధన పొదుపులో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. అవసరంలేని విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, సౌరశక్తిని ఉపయోగించడం వంటి చర్యలు భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడతాయని ఆయన పేర్కొన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dy CM Pawan Kalyan Fires On Udayanidhi Stalin Comments | Asianet News Telugu
Dy CM Pawan Kalyan Sensational Comments : అన్నీ చూస్తున్న... అన్నీ గమనిస్తున్న | Asianet News Telugu