పోలవరం... ఎన్నికల స్టంటేనా?

First Published Oct 3, 2017, 1:45 PM IST
Highlights
  • నత్త నడకలా సాగుతున్న పోలవరం ప్రాజెక్టు పనులు
  • 2018-19కల్లా ప్రాజెక్టును పూర్తి చేస్తానంటున్న చంద్రబాబు
  • 2014 నాటికి కూడా పూర్తి కాదంటున్న టీడీపీ ఎంపీ  జేసీ

పోలవరంలో అసలు ఏం జరుగుతోంది? మూడున్నర ఏళ్లలో ఇప్పటి వరకు ఎంత మేర ప్రాజెక్టు పూర్తయ్యింది? రానున్న రెండు సంవత్సరాల్లో ఇంకా ఎంత మేర పూర్తౌతుంది? అసలు ప్రాజెక్టు పూర్తి అవుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు.. ప్రజల బుర్రలను తొలిచేస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు పనులు అనుకున్నంత ముందుకు సాగడం లేదు. ఒకవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే ఖర్చు మాత్రం పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోతోంది. మరో వైపేమో.. 2019 ఎన్నికలు దగ్గరకి వస్తున్నాయి. దీంతో.. ఏమి చేయాలో అర్థంకాని పరిస్థితిలో పడిపోయారు చంద్రబాబు. అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పనులు జరగడం లేదా అంటే.. జరుగుతున్నాయి.

ఏమిటిరా అంటే.. మట్టి పనులు. ఆ పనులు ఇంకో రెండు మూడు సంవ్సతరాలు సాగినా.. ఆ ప్రాజెక్టులో ఎలాంటి మార్పు కనిపించదు. దీనిని బట్టే అర్థమౌతోంది.. అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో. అసలు పనులు ఎందుకు జరగడం లేదు అనే అనుమానం రావచ్చు. ఎవరికైనా డబ్బులు ఇస్తేనే కదా పనులు చేసేది? డబ్బులు ఇవ్వకుండా పనులు చేయండి అంటే.. ఎవరుమాత్రం చేస్తారు? ఒకవేళ చేసినా ఎన్ని రోజులని చేస్తారు?  అందుకే.. పోలవరం ప్రాజెక్టు నత్తకు నడకలు నేర్పినట్టుగా సాగుతోంది.

 

రాష్ట్ర విభజన జరిగిన సమయంలో.. పోలవరాన్ని జాతియ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది. అంటే... ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలన్నింటినీ కేంద్రమే చూసుకోవాలి. అయితే.. చంద్రబాబు మాత్రం.. ఆ ప్రాజెక్టును తమ ప్రభుత్వమే పూర్తి చేస్తుందని..  కేంద్రం దగ్గర నుంచి లాక్కొన్నాడు. వాళ్లు కూడా ఆయన అడగగానే ఇచ్చేసారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నిర్మాణానికి డబ్బులు ఎవరు ఇవ్వాలి.? కేంద్రం ఇస్తే ప్రాజెక్టు పూర్తి చేస్తానంటున్నడు చంద్రబాబు. అయితే.. గతంలో దీని కోసం కేంద్రం కొంత నిధులు విడుదల చేసింది. మరి ఆ నిధులు ఏమయ్యాయి? ఆ నిధులతో పోలవరంలో ఏ పనులు చేపట్టారు? ఆ లెక్కలు చెప్పండి.. మరికొంత నిధులు విడుదల చేస్తామని కేంద్రం అడుగుతోంది. ఆ నిధులను చంద్రబాబు దారిమళ్లించినట్లు సమాచారం. అందుకే కేంద్రానికి లెక్కలు చూపించలేకపోతున్నాడు. దీంతో వాళ్లు కూడా నిధులు విడుదల చేయడం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారాన్ని వాస్తవం చేసేలా.. టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నేత పురందేశ్వరీ ఇటీవల కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇచ్చిన నిధులకు లెక్కలు చూపితేనే.. మిగితా నిధులు కేంద్రం ఇస్తుందని ఆమె చెప్పడం గమనార్హం.

 

ఇదిలా ఉంటే  చంద్రబాబు.. ప్రజలకు మాత్రం 2018-19లోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతున్నాడు. అయితే.. సొంత పార్టీ ఎంపీ.. జేసీ దివాకర్ రెడ్డే స్వయంగా.. 2024 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కాదని.. ఇప్పటికి చాలా సార్లే చెప్పాడు.  దీనిపై టీడీపీ నేతలు కాదు కదా..చంద్రబాబు కూడా నోరు విప్పలేదు. అంటే.. అది నిజమని ఒప్పుకున్నట్టే కదా అనే వాదన కూడా వినపడుతోంది.

 అయితే ప్రజలను నమ్మించడానికి మాత్రం చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే.. ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుందోమోనని ఆయన భావిస్తున్నారు. అందుకే మొన్నటి వరకు అధికారుల నుంచి ప్రాజెక్టు రివ్వ్యూలు కూడా అడగడం ఆపేసిన చంద్రబాబు.. తాజాగా.. మంగళవారం మళ్లీ పోలవరం పర్యటన మొదలుపెట్టాడు. ఏరియల్ సర్వే నిర్వహించి.. అభివృద్ధి పనులను సమీక్షాస్తానని చెబుతున్నాడు. ఈ పర్యటనలు, రివ్వ్యూల పేరిట ఎంత కాలం ప్రజలను మభ్యపెట్టగలరో ఆయనకే తెలియాలి.

click me!