
తిరుపతి: గత అసెంబ్లీ ఎన్నికల్లోగెలుపుకోసం వైఎస్ జగన్ అనుసరించిన వ్యూహాన్నే ప్రస్తుతం చంద్రబాబు కూడా ఫాలో అవుతున్నారని ఏపీ బిజెపి నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజల సానుభూతిని పొంది గేలవాలన్నదే ఆనాడు జగన్ ఫార్ములా అయితే ఈనాడు చంద్రబాబు ఫార్ములా... అని విష్ణువర్ధన్ ఆరోపించారు.
''సరి లేరు-మీకేవ్వరు? నాడు జగనన్న.! నేడు చంద్రన్న.! నాడు సానుభూతి కోసం కోడికత్తి సంఘటన.! నేడు సానుభూతి కోసం రాళ్లదాడి సంఘటన.! సందర్భాలు, సంఘటనలు వేరైనా ఇద్దరి ఉద్దేశాలు మాత్రం ఒక్కటేనని (ఓట్లు)ప్రజలకు తెలుసు.! ఓట్లకోసం డ్రామాలు వేయడంలోను మీకు మీరే సాటి'' అని సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై విష్ణువర్ధన్ విమర్శలు గుప్పించారు.
read more రాళ్లు విసిరారంటూ చంద్రబాబు కొత్త డ్రామా.. మండిపడ్డ బొత్స (వీడియో)
గతంలో ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు ముందు విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై ఓ యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ దాడి చేయించింది ఆనాటి సీఎం చంద్రబాబేనని వైసిపి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. దీంతో జగన్ ప్రజల్లో సానుభూతిని పొంది భారీ విజయాన్ని అందుకున్నారు.
ఇప్పుడు సీన్ రివర్సయ్యింది. జగన్ సీఎంగా వుండగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా వున్నారు. ఈ సమయంలో తిరుపతి ఉప ఎన్నిక రావడంతో జగన్ అనుసరించిన వ్యూహాన్ని ఫాలో అయి విజయం సాధించాలని చంద్రబాబు చూస్తున్నాడని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. అందుకోసమే రాళ్లదాడి డ్రామా ఆడుతున్నాడని పేర్కొన్నారు. ఈ రెండు ఘటనలు డ్రామాలేనని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.