ఎన్టీఆర్ కు భారతరత్న... మహానాడులో తీర్మానం: చంద్రబాబు వెల్లడి

By Arun Kumar PFirst Published May 28, 2021, 1:21 PM IST
Highlights

ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని మరోసారి కేంద్రాన్ని కోరారు చంద్రబాబు. 

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులుఎన్టీఆర్ వ్యక్తి కాదు శక్తి అని తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అన్నారు. అలాంటి ఎన్టీఆర్ కు కేంద్రం భారతరత్న ఇవ్వాలని... ఇస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లు అవుతుందన్నారు. మహానాడు ద్వారా ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 

ఎన్టీఆర్ 98వ జయంతి సందర్భంగా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ... సాధారణ కుటుంబంలో పుట్టిన ఎన్టీఆర్ అసాధారణ సాధనతో వ్యవస్థగా మారారన్నారు. తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని పేర్కొన్నారు. అధికారం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదని... ప్రజల కోసం టీడీపీని స్థాపించారని చంద్రబాబు అన్నారు. 

''ఆడబిడ్డలందరూ ఎన్టీఆర్ ను అన్న అని పిలిచారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించడమే కాదు మహిళల విద్యకోసం యూనివర్సిటీ పెట్టారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ ను మొదటిసారి ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు'' అని గుర్తు చేశారు. 

read more  ఆ విషయంలో ఎన్టీఆర్ గారే నాకు స్ఫూర్తి: నారా లోకేష్

''బడుగు, బలహీనవర్గాల కోసం ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు ఎన్టీఆర్ సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారు. రూ.2కే కేజీ బియ్యం, ఇళ్ల నిర్మాణం, రెసిడెన్షియనల్ పాఠశాలలు తీసుకువచ్చారు. తెలుగుగంగ ద్వారా రాయలసీమతో పాటు చెన్నైకు తాగునీరు ఇచ్చారు'' అని చంద్రబాబు ఎన్టీఆర్ ను కొనియాడారు. 

''మానవత్వమే నా సిద్ధాంతమని కుండబద్ధలు కొట్టిన వ్యక్తి ఎన్టీఆర్. బీసీలను, యువతను రాజ్యాధికారంలో భాగం చేసిన వ్యక్తి ఎన్టీఆర్. నేషనల్ ఫ్రంట్ పెట్టారు. రూ.11వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేశారు. మాండలిక వ్యవస్థ ద్వారా ఇంటివద్దకే పాలన తీసుకువచ్చారు. అవినీతిపరులకు ఎన్టీఆర్ సింహస్వప్నం. టీడీపీని ఇప్పటికీ ఎవరూ వేలెత్తి చూపడం లేదంటే ఎన్టీఆర్ స్ఫూర్తే కారణం'' అని పేర్కొన్నారు. 

read more  ఘన నివాళి... మనవడు దేవాన్ష్, కొడుకు లోకేష్ తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ కు చంద్రబాబు

''ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఎన్టీఆర్ మాతృభాష తెలుగుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. తెలుగును వదిలిపెట్టి ఇంగ్లీషును తీసుకురావడం ఎప్పుడూ లేదు. తెలుగుతో పాటు ఇంగ్లీషు కూడా నేర్చుకోవాలి కానీ కేవలం ఇంగ్లీషే నేర్పుతామనడం సమజసం కాదు'' అంటూ జగన్ సర్కార్ కు చురకలు అంటించారు చంద్రబాబు. 
 

click me!