కాల్చేస్తే తెగ పొగిడారు, రెడ్లు రేప్ చేస్తే కదలరా: వైఎస్ జగన్ మీద చంద్రబాబు ఫైర్

By telugu teamFirst Published Dec 17, 2019, 7:13 AM IST
Highlights

దళితులపై రెడ్లు రేప్ చేస్తే స్పందించరా అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎం జగన్ ను ప్రశ్నించారు. గుంటూరులో ఐదేళ్ల పాపపై రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు కాబట్టి చర్యలు తీసుకోవాడం లేదా అని అడిగారు.

గుంటూరు: అత్యాచార కేసుల్లోకి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కులం ప్రస్తావన తెచ్చారు. దళితులపై రెడ్లు రేప్ చేస్తే చర్యలు తీసుకోరా అంటూ ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ సమగ్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత బాలికను చంద్రబాబు సోమవారంనాడు పరామర్శించారు. 

హైదరాబాదు దిశ ఘటనలో అత్యాచారం చేసిన నలుగురిని పోలీసులు ఎన్ కౌంటర్ చేస్తే తెలంగాణ సిఎం కేసీఆర్ ను జగన్ తెగ పొగిడారని గుర్తు చేస్తూ గుంటూరులో ఐదేళ్ల పాపపై జరిగిన అత్యాచారం ఘటనపై ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. బాధితురాలు దళిత కుటుంబానికి చెందడం వల్ల, అత్యాచారం చేసినవాడు రెడ్డి వర్గానికి చెందినవాడు కావడం వల్ల స్పందించడం లేదా అని ఆయన జగన్ ను ప్రశ్నించారు.

జగన్మోహన్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదని, జగన్ ది స్ప్లిట్ పర్సనాలిటీ అని చంద్రబాబు అన్నారు.  మాట మీద నిలబడే స్వభావం జగన్ కు లేదని చంద్రబాబు అన్నారు. ఆడపిల్లల సంరక్షణకు దిశ చట్టం తెచ్చిన రోజునే గుంటూరులో ఐదేళ్ల పసిపాపపై అత్యాచారం జరిగిందని, ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ పాపను పరామర్శించే తీరిక సిఎంకు గానీ మంత్రులకు గానీ లేదని ఆయన అన్నారు.

బాధిత బాలికకు అందిస్తున్న చికిత్సల గురించి చంద్రబాబు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన లక్ష్మారెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బాధిత బాలిక పేరట రూ. 25 లక్షలు డిపాజిట్ చేయాలని ఆయన కోరారు. ఇల్లు, మూడెకరాల పొలం, తల్లికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని, బాలికను ప్రభుత్వమే చదివించాలని ఆయన కోరారు. టీడీపీ తరఫున బాధిత కుటుంబానికి రూ. 50 వేల సాయం ప్రకటించారు.

click me!