
వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబనాయుడు ఓటుబ్యాంకును విస్తరించుకుంటున్నారు. మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ విషయం స్పష్టమవుతోంది. ‘చంద్రన్న పెళ్ళికానుక’ పథకం ఇందులో భాగమే. ఈ పథకం బీసీలను ఆకట్టుకునేందకే అన్న విషయం కొత్తగా విడమరచి చెప్పనక్కర్లేదు. చంద్రన్న పెళ్ళి కానుక పథకంలో భాగంగా ప్రతీ ఒక్కరికీ రూ. 30 వేలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. మరో రూ. 5 వేలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు మంత్రి కాల్వ శ్రీనివాసులు చెప్పటం గమనార్హం.
ఇప్పటికే మైనారిటీలకు దుల్హన్ పథకం క్రింద రూ. 50 వేలు ఇస్తున్నారు. దళితులకు కూడా రూ. 40 వేలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పటం దేనికి సంకేతాలు? ఏ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలంటే దళితులు, బీసీల మద్దతు ఎంత అవసరమో చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానికితోడు మైనారిటీల ఓట్లు.. ఇక చెప్పేదేముంది? అందుకనే చంద్రబాబు రెండంచెల విధానాన్ని అవలంభిస్తున్నారు.
ఒకటి నేరుగా వ్యక్తిగత ప్రయోజనాలను సంతృప్తి పరుస్తూనే సామాజికవర్గాలను ఉద్ధరిస్తున్న ముసుగులో కూడా కుటుంబాలను సంతృప్తి పరచటం. అందుకు ‘పెళ్ళి కానుకలం’టూ ఎర వేస్తున్నారు.
అందులో నుండి వచ్చినదే బీసీల పెళ్ళికానుక పథకం. 18 ఏళ్ళు నిండిన తర్వాత వివాహం చేస్తేనే పథకం వర్తిస్తుందట. వివాహం నిశ్చయం కాగానే 20 శాతం డబ్బిస్తారట. పెళ్ళి తర్వాత మిగిలిన సొమ్మును అర్హుని బ్యాంకు ఖాతాలో జమచేస్తారట. స్వయానా పెళ్ళి కూతురు, పెళ్ళి కొడుకుకు ఆశ్వీరాదాలు కూడా సిఎం పంపుతారట.
నిజానికి పేదలను ఆదుకోవటమే ప్రభుత్వ లక్ష్యమైతే అన్నీ సామాజికవర్గాల్లోనూ పేదలున్నారు కదా ? సామాజికవర్గంతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి పెళ్ళి కానుక పథకాన్ని ఎందుకు వర్తింపచేయటం లేదు? దళితులు, మైనారిటీలు బీసీలకు మాత్రమే పథకాన్ని ఎందుకు వర్తింపచేస్తున్నట్లు ?
అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. వారంతా ఓటు బ్యాంకన్నమాట. బీసీ ఓటుబ్యాంకును సుస్ధిరం చేసుకోవటం, దళిత ఓటుబ్యాంకును విస్తరించుకోవటం, మైనారిటీ ఓటుబ్యాంకును ఆకట్టుకోవటం. వీటికి అదనంగా రేషన్ కార్డలు, పించన్లు, ఇళ్ళ కేటాయింపుల లాంటి పథకాలు ఎటూ ఉంటాయనుకోండి అది వేరే సంగతి.
ముందస్తు ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతోంది కదా? అందుకనే ఓటు బ్యాంకులపై చంద్రబాబు దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. ఓటుబ్యాంకులపై ఎంత ఖర్చు పెట్టినా సొంత జేబులో నుండి ఖర్చు పెట్టరుకదా? లాభం జరిగితే చంద్రబాబుకు లేకపోతే భారం జనాల జేబులకే. ఏమంటారు ?