
మందస: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (tdp)కి చెందిన కార్యకర్త ఒకరు బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. అయితే అధికార వైసిపి నాయకుడిపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు పోలీసులు వేధించారని... అందువల్లే ఇలా ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు (chandrababu naidu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (nara lokesh) ఘాటుగా స్పందించారు.
''శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన తెలుగుదేశం కార్యకర్త కోన వెంకట్రావుది ముమ్మాటికీ ప్రభుత్వం చేసిన హత్యే. సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకే వేధించి ప్రాణాలు తీశారు. వెంకట్రావు మృతికి కారణం అయిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, పోలీసులపైన కేసు నమోదు చెయ్యాలి. వెంకట్రావు మృతితో తీవ్ర విషాదంలో ఉన్న ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను'' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇక శ్రీకాకుళం (srikakulam district) టిడిపి కార్యకర్త ఆత్మహత్య ఘటనపై నారా లోకేష్ సీరియస్ అయ్యారు. ఏపీలో ఉన్నది పోలీసులా? వైసీపీ రౌడీషీటర్లకి అనుచరులా? అనే అనుమానాలు కలుగుతున్నాయని మండిపడ్డారు. తన భావవ్యక్తికరణ స్వేచ్చకు లోబడి కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడమే కోన వెంకటరావు చేసిన నేరమా? అని లోకేష్ నిలదీసారు.
''శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామ టీడీపీ కార్యకర్త వెంకటరావుని వేధించి బలవన్మరణానికి పాల్పడేలా చేసిన వైసీపీ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వ వైఫల్యాలు, వైసీపీ అవినీతి, అక్రమాలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఇలా చంపుకుంటూపోతే రాష్ట్రంలో వైసీపీ నేతలు-పోలీసులు మాత్రమే మిగులుతారు'' అని లోకేష్ అన్నారు.
''మా టిడిపి కార్యకర్త కోన వెంకటరావు మృతికి కారణమైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, బాధ్యులైన పోలీసులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి. వెంకటరావు కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అన్ని విధాలా అండగా వుంటుంది. సోషల్ మీడియా పోస్ట్ ల పేరుతో టిడిపి కార్యకర్తలపై ఇకనైనా వేధింపులు ఆపాలి. చట్టాలని గౌరవిస్తున్నామని ...పోలీసుల్ని అడ్డుపెట్టుకుని అరాచకాలకి తెగబడితే తిరుగుబాటు తప్పదు'' అని లోకేష్ హెచ్చరించారు.
ఇదిలావుంటే మృతుడు వెంకట్రావు కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై ఇటీవల టిడిపి కార్యకర్త వెంకట్రావు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. దీంతో ఎమ్మెల్సీ అనుచరులు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేసారు. అధికార పార్టీ నేత ఒత్తిడితో పోలీసులు వెంకట్రావును వేధించడం ప్రారంభించారు. ఊరు వదిలి వెళ్లిపోవాలని పోలీసులు బెదిరించాలని వెంకట్రావు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వేధింపులు మరీ శృతిమించడంతో వెంకట్రావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
వెంకటరావు మృతితో పొత్తంగి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుల కుటుంబాన్ని టిడిపి నాయకురాలు గౌతు శిరీషతో పాటు ఇతర నేతలు పరామర్శించారు. కార్యకర్త ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని టిడిపి శ్రేణులు ఆస్పత్రి వద్ద బైఠాయించారు. దీంతో ఉద్రక్త పరిస్థితి నెలకొంది.