
ప్రతిపక్షం డిమాండ్ ను చంద్రబాబునాయుడు అంగీకరిస్తారా? ఛాన్సేలేదు. 10వ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజిలో మంత్రులు కమ్ వియ్యంకులైన గంటా శ్రీనివాసరావు, నారాయణలను తక్షణమే మంత్రిపదవుల నుండి బర్తరఫ్ చేయాలంటూ వైసీపీ డిమాండ్ చేస్తోంది. అసెంబ్లీలో ఇదే విషయమై ప్రతిపక్షం నానా రచ్చ చేస్తోంది. వైసీపీ పిచ్చిగానీ మంత్రులిద్దరినీ చంద్రబాబు బర్తరఫ్ చేసే ఛాన్స్ లేదుగాక లేదు. ఎందుకంటే, వారిద్దరి పవర్ అటువంటిది.
నారాయణ సిఎంకు ఎంతటి సన్నిహితుడో అందరికీ తెలిసిందే. చాలా ‘విలువైన’ వ్యక్తి చంద్రబాబు, టిడిపికి. ఆయనకు వియ్యంకుడు ఇంకో విలువైన వ్యక్తి గంటా. కాబట్టి ప్రతిపక్షం డిమాండ్ ను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోరు. ప్రశ్నపత్రం లీకేజి వాస్తవం. అందుకు ముందు నైతిక బాధ్యత వహించాల్సింది విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస్ రావు. తర్వాత బాధ్యత తీసుకోవాల్సింది నారాయణ. ఎందుకంటే, ఆయన విద్యా సంస్ధల నుండి లీకేజి మొదలైనట్లు ఆధారాలు కనబడుతున్నాయి కాబట్టి. కాకపోతే ఇపుడు నైతికత గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు? అందుకే వారిద్దరికి చీమ కుట్టినట్లు కూడా లేదు.
అదేసమయంలో వారికి బదులుగా ఎవరో ఒక బకరాని బలి తీసుకోవచ్చని ప్రచారం మొదలైపోయింది. అంటే ఆ బకరాను కూడా ఈ పాటికే సిద్ధం చేసే ఉంటారు. నారాయణ విద్యాసంస్ధల నుండే ప్రశ్నపత్రాలు లీకవుతున్నట్లు ప్రతిపక్షం ఆరోపిస్తున్నది. నెల్లూరు జిల్లాలోనే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఇప్పటికే నివేదికను కూడా ప్రభుత్వానికి ఇచ్చేసారు. మరి ఇంకా విచారణ చేయిస్తామని గంటా చెప్పటంలో అర్ధం లేదు.
ప్రశ్నపత్రాలు లీకైన సంగతి ప్రభుత్వానికి తెలీదా? ఎందుకు తెలీదు. బాగా తెలుసు. కాకపోతే ఆ విషయాన్ని అంగీకరిస్తే వైసీపీ ముందు తలొంచినట్లవుతుందని చంద్రబాబు బెట్టు చేస్తున్నారు. ప్రశ్నపత్రం లీకైనట్లు మొదటిరోజు ఆరోపణలు రాగానే ప్రభుత్వ సక్రమంగా స్పందించి ఉంటే ఇపుడు ఈ సమస్య వచ్చి ఉండేది కాదేమో. అయినా మంత్రులపై చర్యలు తీసుకోవాలంటే చంద్రబాబుకు ఎంత ధైర్యముండాలి? మంత్రులు కమ్ వియ్యంకులు కమ్ కాపు నేతలపైన చర్యలకు ఉపక్రమిస్తే ఇంకేమన్నా ఉందా? అందుకనే వైసీపీ డిమాండ్లను చంద్రబాబు అస్సలేమాత్రం పట్టించుకోవటం లేదు.