ఆంధ్రపదేశ్ హైకోర్టు జడ్జీలపై, న్యాయాధికారులు, కోర్టు తీర్పులతో సహా న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో (Social Media) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ మరో అడుగు ముందుకు పడింది. ఈ కేసులో మరో ఆరుగురిపై సీబీఐ (CBI) చార్జ్‌షీట్ నమోదు చేసింది
ఆంధ్రపదేశ్ హైకోర్టు జడ్జీలపై, న్యాయాధికారులు, కోర్టు తీర్పులతో సహా న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో (Social Media) అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణ మరో అడుగు ముందుకు పడింది. ఈ కేసులో మరో ఆరుగురిపై సీబీఐ (CBI) చార్జ్‌షీట్ నమోదు చేసింది. జడ్జిలపై అనుచిత పోస్ట్‌లు చేసిన ఆరుగురిపై చార్జీషీటు దాఖలు చేసినట్టుగా సీబీఐ వెల్లడించింది. శ్రీధర్ రెడ్డి అవుతు, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిసా, సుద్దులూరి అజయ్ అమృత్ లపై చార్జ్ షీట్లు దాఖలు చేసినట్లు సీబీఐ తెలిపింది.
నిందితులను ఈ ఏడాది అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి సీబీఐ అరెస్టు చేసింది. మొత్తం ఆరుగురు నిందితులు శ్రీధర్ రెడ్డి అవుతు, జలగం వెంకట సత్యనారాయణ, గూడ శ్రీధర్ రెడ్డి, శ్రీనాథ్ సుస్వరం, కిషోర్ కుమార్ దరిసా, సుద్దులూరి అజయ్ అమృత్ ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజా పరిణామంతో ఈ కేసులో ఇప్పటివరకు సీబీఐ అరెస్టు చేసిన మొత్తం నిందితుల సంఖ్య 11కి చేరింది.
విచారణలో, మొబైల్స్, ట్యాబ్లెట్లు సహా మొత్తం 13 డిజిటల్ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 53 మొబైల్ కనెక్షన్లకు సంబంధించిన కాల్ డిటైల్స్ రికార్డులను సీబీఐ సేకరించింది. ఈ కేసులో 12 మంది నిందితులు, 14 మందిని విచారించారు. విచారణ సమయంలో.. డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నిక్ ఉపయోగించి డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నుంచి కూడా ఆధారాలను సేకరించినట్లు అధికారులు తెలిపారు.
‘మరో నిందితుడిపై సాక్ష్యాలను సేకరించే దిశగా దర్యాప్తు కొనసాగుతోంది. అతని యూట్యూబ్ ఛానెల్ కూడా బ్లాక్ చేయబడింది. అంతేకాకుండా.. భారతదేశంలోని సమర్థ న్యాయస్థానాల నుంచి విదేశాలలో ఉన్న ఇద్దరు నిందితుల పేర్లతో సీబీఐ అరెస్టు వారెంట్లు తీసుకుంది. వారిని అరెస్టు చేయడానికి దౌత్య మార్గాల ద్వారా ప్రక్రియ ప్రారంభించబడింది’ అని సిబిఐ ప్రతినిధి ఆర్‌సి జోషి చెప్పారు.
జడ్జీలపై సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల మీద సీబీఐ గతేడాది నవంబర్‌లో కేసు నమోదు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ.. సీఐడీ నమోదు చేసిన కేసులను పరిశీలించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుండి వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబడ్డాయి. ఇందుకు సంబంధించి గతేడాది నవంబరు 11న ఐపీసీ 153(ఏ), 504, 505(2), 506 సెక్షన్లు, ఐటీ చట్టం కింద 16 మందిపై కేసు నమోదు చేశామని సీబీఐ గతంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిలో 13 మందిని గుర్తించామని.. ముగ్గురు విదేశాల్లో ఉన్నారని చెప్పారు. 13 మందిలో 11 మందిని విచారించి.. ఐదుగురిని అరెస్టు చేశామని ఈ ఏడాది ఆగస్టులో తెలిపారు. విదేశాల్లో ఉన్నవారిని రప్పించేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు.
సీబీఐ విచారణపై హైకోర్టు సీరియస్..
ఇక, ఇటీవ జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలపై నమోదైన కేసులో.. గత వారం Andhra Pradesh High Courtలో విచారణ సాగింది. ఈ సందర్భంగా CBIపై సీరియస్ అయింది. పంచ్ ప్రభాకర్‌ను ఎలా పట్టుకుంటారో చెప్పాలని సీబీఐని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు సరైన సమాధానాన్ని సీబీఐ ఇవ్వలేదు. దీంతో ఉన్నత న్యాయస్థానం ఆగ్రహించింది. మేం చెప్పింది వినకపోతే... మీరు చెప్పే మాటలు వినాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రాసిక్యూషన్ ఏం చేయాలో మేం ఆదేశాలిస్తామని తెలిపింది. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(SIT) ఏర్పాటు చేస్తామని వివరించింది.