రాజకీయాల్లోకి జేడీ లక్ష్మీనారాయణ...26న పార్టీ ప్రకటన

By sivanagaprasad kodatiFirst Published Nov 23, 2018, 8:38 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర క్యాడర్ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రాబోతోంది. సీబీఐ మాజీ జేడీ, మహారాష్ట్ర క్యాడర్ మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాజకీయాలు, ప్రజాసేవపై ఇష్టంతోనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

ఈ క్రమంలో ఆయన జనసేన, టీడీపీ, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి సేవ చేస్తానని ప్రకటించారు. దీనిలో భాగంగా ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి.. గ్రామీణులు, ప్రధానంగా రైతుల సమస్యలపై గ్రామస్తులతో మమేకమయ్యారు..

కళాశాలల్లో పర్యటించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. తిత్లీ తుఫాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకుని.. నష్టనివారణ చర్యలు, సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి నివేదిక ఇచ్చారు.

ఈ క్రమంలో లక్ష్మీనారాయణ తెలుగుదేశంలో చేరుతారనే ప్రచారం భారీగా జరిగింది. వీటన్నింటికి తెర దించుతూ... తానే సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. వ్యవవసాయం, విద్య, ఆరోగ్య రంగాల్లో సంస్కరణలే ప్రధాన అజెండాగా ఆయన పార్టీ ఉండనుంది.

ఈ నెల 26న కొత్త పార్టీ పేరును ప్రకటించి.. లక్ష్యాలు, అజెండాను లక్ష్మీనారాయణ ప్రజలకు వివరిస్తారని సమాచారం. కడప జిల్లాకు చెందిన ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీశైలంలో జరిగింది.. వరంగల్ నిట్‌ నుంచి ఇంజనీరింగ్‌లో పట్టా... చెన్నై ఐఐటీ నుంచి ఎంటెక్ పూర్తి చేశారు. 1990 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు.

click me!