జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Nov 22, 2018, 9:56 PM IST
Highlights

జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెబ్లీ రద్దు  కేంద్రంలో బీజేపీ నేతల ఫాసిస్ట్ చర్యలకు పరాకాష్ట అని ఆరోపించారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

అమరావతి: జమ్ము-కాశ్మీర్ అసెంబ్లీ రద్దుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెబ్లీ రద్దు  కేంద్రంలో బీజేపీ నేతల ఫాసిస్ట్ చర్యలకు పరాకాష్ట అని ఆరోపించారు. జమ్ము కాశ్మీర్ అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. 

గడువు తీరకముందే శాసనసభను రద్దు చేయడం అప్రజాస్వామికమన్న చంద్రబాబు కేంద్రంలో నరేంద్రమోది ప్రభుత్వ రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పరాకాష్ట అంటూ ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను కాలరాసే చర్యగా అభివర్ణించారు. 

సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచేలా బీజేపీ వ్యవహరిస్తుందని మండిపడ్డారు. బీజేపీ నిరంకుశ పెత్తందారీ పోకడలకు జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ రద్దు అద్దం పడుతుందని వ్యాఖ్యానించారు.  ఈ చర్యలను దేశం మెుత్తం ముక్తకంఠంతో ఖండిచాలని పిలుపునిచ్చారు. 

రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, అభ్యుదయ వాదులు ఈ దుశ్చర్యను ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని, తనకు 56మంది సభ్యుల బలం ఉందని  పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ (పిడిపి) ఛీఫ్ మెహబూబా ముఫ్తీ  కోరినా గవర్నర్ స్పందించక పోవడం దారుణమన్నారు.

రాజ్ భవన్ లో ఫాక్స్ మెషీన్ పనిచేయక పోవడం, ఫోన్ కు గవర్నర్ అందుబాటులోకి రాకపోవడం, మెయిల్ పంపినా పరిగణలోకి తీసుకోక పోవడం, అన్నింటి వెనుక కేంద్రంలోని బీజేపీ నేతల హస్తం ఉందనేది అర్థమవుతుందన్నారు. 
రాజ్యాంగ ఔన్నత్యాన్ని కాపాడే ప్రయత్నం చేయలేదన్నారు. 

రాజ్ భవన్ హుందాతనం ఏమాత్రం కనబడటం లేదని ధ్వజమెత్తారు. 2016  ఏప్రిల్ 4న ఏర్పడిన మెహబూబా ముఫ్తీ సంకీర్ణ ప్రభుత్వానికి 26నెలలు పూర్తికాకుండానే బీజేపీ మద్దతు ఉపసంహరించడం,వెంటనే గవర్నర్ పాలన పెట్టడం, మరో 6నెలలు పూర్తికాకుండానే అసెంబ్లీని రద్దు చేయడం అన్నీ బీజేపీ అధికార దాహానికి నిదర్శనాలేనని విమర్శించారు. 


నరేంద్రమోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను పూర్తిగా దెబ్బతీస్తోందని చంద్రబాబు ధ్వజమెత్తారు.పెత్తందారీ పోకడలతో వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు.. సమాఖ్య రాజ్య స్ఫూర్తికే తూట్లు పొడుస్తూ సర్కారియా కమిషన్ సిఫారసులను బేఖాతరు చేస్తోందన్నారు. 

పూంఛ్ కమిటి సిఫారసులను కూడా కేంద్రం అటకెక్కించిందని ఆరోపించార. ఫెడరల్ వ్యవస్థనే కాలరాసేలా బీజేపీ వ్యవహరిస్తోందని దుయ్యబుట్టారు. మణిపూర్, గోవా, మేఘాలయలో ఏవిధంగా ప్రజాతీర్పును కాలరాశారో దేశం మొత్తం చూసిందని గుర్తు చేశారు. 40స్థానాలున్న గోవాలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ వచ్చినప్పటికీ దానిని ప్రభుత్వం ఏర్పాటుకు పిలవకుండా ఏవిధంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో చూశామన్నారు.

 కానీ కర్ణాటకకు వచ్చేసరికి ఆ సాంప్రదాయాన్ని పాటించకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బిజెపి వచ్చిందని యడ్యూరప్పతో ఏవిధంగా ప్రమాణం చేయించారో, తరువాత ఏవిధంగా బలపరీక్ష నాడు ఓడిపోయారో దేశ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. 

మణిపూర్ లో ఒకరకంగా, మేఘాలయలో మరోరకంగా  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారంటూ ఘాటుగా విమర్శించారు. రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిందపడ్డా తమదే పైచేయి కావాలనే బీజేపీ నేతల అహంభావాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. 

అడుగడుగునా గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేయడమే  కాకుండా గవర్నర్లను అడ్డం పెట్టుకుని రాష్ట్రాలలో పరిపాలన సజావుగా సాగకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలను బీజేపీ చేస్తుందని చంద్రబాబు ఆరోపించారు. 
ఒకవైపు టీమ్ ఇండియా స్ఫూర్తి  అనిచెబుతూ మరోవైపు ఫెడరల్ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు.

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాలరాయడమేనా బీజేపీ టీమ్ ఇండియా స్ఫూర్తి..? ఇది టీమ్ ఇండియానా..? బ్లేమ్ ఇండియానా..? అంటూ నిలదీశారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన మనదేశానికి ఉన్న మంచిపేరును చెడగొడుతున్నారని విమర్శించారు. భారతదేశ రాజ్యాంగం ప్రపంచానికే తలమానికమని అలాంటి రాజ్యాంగ ఔనత్యాన్నే దెబ్బతీస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 


గత నాలుగున్నరేళ్లుగా దేశంలో పరిణామాలను చూస్తుంటే అధికారమే పరమావధిగా బీజేపీ నేతలు ఎలా ప్రవర్తిస్తున్నారో అందరూ గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ సంస్థల స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నారంటూ గుర్తు చేశారు. 

ఆర్ బిఐ, సిబిఐ, కాగ్, ఈడి, ఐటి వంటి వ్యవస్థలను సైతం పతనం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రిజర్వ్ బ్యాంకు వద్ద నిల్వ నిధుల కోసం ఒత్తిడి చేసిన ప్రధానిని గతంలో ఎన్నడూ చూడలేదన్నారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐలో అధికారులు పరస్పరం కేసులు పెట్టుకోవడం విన్నామా.? సిబిఐ కార్యాలయానికి సిబిఐ అధికారులే సీజ్ చేయడం చూశామా..? ప్రత్యర్ధులపై కక్ష సాధింపుగా ఐటి దాడులు చేయించడం గతంలో జరిగిందా..? అంటూ కేంద్రాన్ని నిలదీశారు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఈ దేశం నియంతలను భరించదు అలాగే పెత్తందారీ పోకడలను అసలే సహించదన్నారు. దీనికి తగిన మూల్యం బీజేపీ నేతలు చెల్లించక తప్పదన్నారు. రాబోయే ఎన్నికల్లో దీనికి తగిన గుణపాఠం చెప్పేందుకు దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని చంద్రబాబు కేంద్రానికి హెచ్చరించారు.
 

click me!