స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం : చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా భువనేశ్వరి, బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ

By Siva Kodati  |  First Published Sep 16, 2023, 9:46 PM IST

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు.


ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం రాజమండ్రిలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. టీడీపీ కార్యకర్తలు, స్థానిక మహిళలతో కలిసి నగరంలోని తిలక్ రోడ్ సాయిబాబా దేవాలయం నుంచి శ్యామలానగర్ రామాలయం జంక్షన్ వరకు ఈ ర్యాలీ చేపట్టారు. టీడీపీ కొవ్వొత్తుల ర్యాలీకి మహిళా , ప్రజా సంఘాలు మద్ధతు ప్రటించాయి. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర టీడీపీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. 

ఇదిలావుండగా.. రాజమండ్రి జైలులో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య శాఖ నిర్ణయం తీసుకుంది. మొత్తం 10 మందితో వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఐదుగురు వైద్యులు, ముగ్గురు వైద్య సిబ్బంది, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. వైద్యుల బృందంలోని ముగ్గురు రాజమహేంద్రవరం ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి చెందిన వారని తెలుస్తోంది. వీరు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ నియంత్రణలో ఉంటారు. మరో ఇద్దరు వైద్యులు జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి పరిధిలో పనిచేసేవారు. 

Latest Videos

ALso Read: అబద్దాలు, కట్టుకథలు, ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తో చంద్రబాబు అరెస్ట్..

అంతేకాకుండా రెండు యూనిట్ల ‘‘O’’ పాజిటివ్ రక్తం నిత్యం అందుబాటులో ఉంచాలని కూడా వైద్యశాఖ ఆదేశించింది. అలాగే అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలని తెలిపింది. అయితే చంద్రబాబుకు ఆకస్మాత్తుగా  ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. 

 

click me!