
క్రమశిక్షణ తప్పిన నాయకులపై చర్యలు తీసుకోవాలంటే చాలా మందిపైనే చంద్రబాబునాయుడు వేటు వేయాల్సుంటుంది. చంద్రబాబు అంత ధైర్యం చేస్తారా? ‘బహిరంగ వ్యాఖ్యలు చేసే ఒకరిద్దరిపై చర్యలు తసుకుంటే తప్ప పద్దతి మారదు’ ఇదీ చంద్రబాబు ఆలోచన. చిత్తూరు ఎంపి శివప్రసాద్ వ్యవహారంలో మంత్రులతో మాట్లాడినపుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్తూరులో ఎంపి మాట్లాడుతూ, ఎస్సీలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. మంత్రి పదవుల్లో కూడా న్యాయబద్దమైన ప్రాతినిధ్యం కల్పించలేదని ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను సిఎం దారిమళ్లిస్తున్నట్లు ధ్వజమెత్తారు. ఇలా చాలా మాట్లాడారు ఎంపి. దాంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం మొదలైంది.
అదే విషయమై చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో టెలికాన్ఫరెన్స్ లో చర్చించారు. బహిరంగంగా వ్యాఖ్యలు చేసే ఒకరిద్దరిపై చర్యలు తీసుకోకపోతే లాభం లేదంటూ అభిప్రాయపడ్డారు. సరే ఎవరిపై ఏం చర్యలు తీసుకుంటారన్నది వేరే విషయం. క్రమశిక్షణ తప్పిన నేతలపై చంద్రబాబు చర్యలు తీసుకోగలరా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే, మొన్నటి మంత్రివర్గ విస్తరణ తర్వాత చాలా మంది చంద్రబాబుపై బహిరంగ వ్యాఖ్యలు చేసారు. తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు కదా? వారందరిపైనా ఇపుడు చర్యలు తీసుకోగలరా?
మంత్రివర్గంలో చోటు దక్కలేదని గౌతు శ్యామ్ సుందర్ శివాజి, బోండా ఉమ, బండారు సత్యనారాయణమూర్తి, చింతమనేని ప్రభాకర్, గొల్లపల్లి సూర్యారావు, కాగిత వెంకట్రావు, బుచ్చయ్యచౌదరి, రామసుబ్బారెడ్డి ఇలా చాలామంది చంద్రబాబు వైఖరిని తప్పపడుతూ తమ అసంతృప్తని బాహాటంగానే వ్యక్తం చేసారు కదా? మరి వారందరిపై ఏం చర్యలు తీసుకుంటారు? ఎందరిపై వేటు వేస్తారు? వారంతా ఎంపికన్నా ముందే మాట్లాడారు కదా? అప్పుట్లో వారిపై చర్యలు తసుకోవాలని చంద్రబాబు ఎందుకనుకోలేదు? ఇదంతా చూస్తుంటే కేవలం శివప్రసాద్ మీద మాత్రమే చర్యలు తీసుకోవాలని ఇదివరకే చంద్రబాబు నిర్ణయించినట్లు కనబడుతోంది. కాకపోతే సమమం కోసం ఎదురుచూస్తున్నట్లు కనబడుతోంది. అందుకే ఇంత తతంగం నడిపిస్తున్నారు. చూద్దాం ఎంపిపై ఏం చర్యలు తీసుకుంటారో?