వైసీపీలోకి టీడీపీ ఎంపీ శివప్రసాద్ !

First Published Apr 15, 2017, 3:20 PM IST
Highlights

చంద్రబాబుపై ఇలా ‘శివ’తాండవ చేయడానికి చాలా కారణాలే ఉన్నాయట.

టీడీపీలో పెద్దలనెందరినో కాదని చినబాబు పెద్దల సభకు వచ్చినప్పటి నుంచి రాజుకున్న నిప్పు ఏపీ మంత్రివర్గ విస్తరణతో భగ్గుమంది. ఇప్పుడు అది దావానంలా పార్టీనే తగలబెట్టేలా ఉంది. ఆగస్టు సంక్షోభం కాస్త ముందే వచ్చేలా ఉంది.

 

ఇప్పటికే మంత్రి వర్గంలో చోటు దక్కలేదని బోండా ఉమ రెచ్చిపోవడంతో పార్టీ లో రచ్చ మొదలైంది. ఆయన మాత్రం పార్టీ మారే ఛాన్స్ లేదు కాబట్టి ఇంట్లో ఉంటూనే పొగపెడుతున్నారు.

 

మరికొందరు అసంతృప్త టీడీపీ నాయకులు మాత్రం అప్పుడే తట్టా బుట్టా సర్ధుకొని ఫ్యాన్ గాలి కింద సేద తీరడానికి రెడీ అవుతన్నారు. ఇప్పటికే క్యూలో జమ్మలమడుగు నుంచి రాం సుబ్బారెడ్డి, నంద్యాల నుంచి శిల్పా మోహన్ రెడ్డి జగన్ పార్టీలో జంప్ చేయడానికి ముహూర్తం కూడా పెట్టించుకున్నారని టాక్. ఈ లిస్టులో తాజాగా టీడీపీ ఎంపీ శివప్రసాద్ కూడా చేరారు. ఈయన కూడా వైసీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

అన్నగారి అభిమాని గా టీడీపీ నమ్మినబంటుగా తెర మీదే కాదు రాజకీయాల్లోనూ పచ్చదనాన్ని గుండెల నిండా చూపించే శివ ప్రసాద్ పార్టీ అధినేతపైనే ఫైర్ అవడంతో ఈ ప్రచారం మొదలైంది.

ఏపీలో దళిత వ్యతిరేక పాలన సాగుతోందంటూ ఆయన చంద్రబాబు టార్గెట్ గా సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దళితులు నివశిస్తున్న హథీరాం బాబా మఠం భూములు క్రమబద్ధీకరణ చేయమని అడగడం నేరమా అని ఆయన సూటిగా చంద్రబాబునే  ప్రశ్నించారు. 2003లో చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారమే క్రమబద్దీకరణ చేయమన్నాని వివరణ కూడా ఇచ్చారు.

 

అయితే దీనిపై చంద్రబాబు స్వయంగా టెలీకాన్ఫరెన్స్ లో తనకు క్లాస్ పీకడంపై కూడా ఆయన మండిపడ్డారు. అలా చేసి చంద్రబాబు టైం వేస్టు చేసుకున్నాడని సెటైర్ కూడా వేశారు. ఇప్పటికే దళిత వ్యతిరేక ప్రభుత్వం అన్న తన మాటలకు కట్టుబడే ఉంటానని చంద్రబాబుపై వెనక్కి తగ్గేది లేదని కుండబద్దలు కొట్టారు.

 

అధినేతతోనే ఢీ అంటే ఢీ అనే స్థాయికి వెళ్లారంటే పార్టీ జంప్ చేయడానికి ముహూర్తం సిద్ధం చేసుకున్నారని ముందస్తు చర్యల్లో భాగంగానే ఇలా చంద్రబాబుపై స్క్రిప్టు తయారు చేసుకున్నారని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.

click me!