ప్రభుత్వాన్ని కడిగేసిన ‘కాగ్’

First Published Mar 31, 2017, 6:30 AM IST
Highlights

ఇపుడు కాగ్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

చంద్రబాబునాయడు ప్రభుత్వాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కడిగేసింది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎంతో గొప్పగా చెప్పుకుంటున్న సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాల్లోని డొల్ల తనాన్ని ఎత్తిచూపింది. ప్రధానంగా పట్టిసీమ ప్రాజెక్టులోని అవినీతిపై ప్రభుత్వాన్ని దుమ్ముదులిపేసింది. అదేవిధంగా సంక్షేమ పథకాల అమలులోని లోపాలను బయటపెట్టింది. వివిధ సంస్ధలకు చేస్తున్న భూపందేరాన్ని కూడా తప్పుపట్టింది. పెన్షన్ల పథకం అమలును, మార్కెట్ యార్డుల నిర్వహణ లోపాలను లోపాలను ఎండగట్టింది. ఒకటేమిటి దాదాపు అన్నీ పథకాల అమలును తూర్పారబట్టింది.

పట్టిసీమ ప్రాజెక్టులో సుమారు రూ. 200 కోట్ల అవినీతి జరిగిందన్న నిజాన్ని బట్టబయలు చేసింది. ప్రభుత్వ తీరు వల్లే ప్రాజెక్టుపై అదనపు భారం పడిందని స్పష్టంగా చెప్పింది. అవసరం లేకపోయినా ప్రాజెక్టు డిజైన్ మార్చినట్లు పేర్కొంది. పోలవరం కుడికాల్వ, డిస్ట్రిబ్యూటరీలు పూర్తికాకుండానే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టటాన్ని తప్పుపట్టింది. పారిశ్రామిక, గృహవినియొగదారులను గుర్తించకపోవటాన్ని కాగ్ తప్పుపట్టింది.

గురురాఘవేంద్ర పులికనుమ ప్రాజెక్టులోను, పురషోత్తమ పట్నం పంప్ హౌస్ విషయంలో, పుష్కర ఎత్తిపోతల పథకం ఆయకట్టు ఏర్పాటులో అవతతవకలను ఎత్తిచూపింది. వ్యవసాయ మార్కెట్ యార్డుల పనితీరు ఘోరంగా ఉందని వాపోయింది. 99 యార్డలను తనిఖీ చేస్తే 90 యార్డుల్లో ఎలాంటి లావాదేవీలు జరిగినట్లు కనబడలేదని చెప్పటం ఆశ్చర్యం. వృద్ధాప్య పెన్షన్ల కోసం లక్షలాది ధరఖాస్తులు పెండింగ్ లో ఉండటాన్ని కాగ్ తప్పుపట్టింది. రెసిడెన్షియల్ పాఠశాలలకు ఆహారం తక్కువ సరఫరా అవుతున్న విషయాన్ని ఎండగట్టింది.

కాగ్ నివేదికను చూస్తే ఇంతకాలంగా వైసీపీ చేస్తున్న  ఆరోపణలు నిజమే అనిపిస్తోంది. దాదాపు ఇవే ఆరోపణలతో గడచిన మూడేళ్ళుగా వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. తన ఆరోపణలకు మద్దతుగా ప్రతిపక్షం ఎన్ని ఆధారాలను చూపతున్నా ప్రభుత్వం లెక్క చేయటం లేదు. మరి ఇపుడు కాగ్ లేవనెత్తిన అంశాలతో కూడా ప్రభుత్వం విభేదిస్తుందో ఏమో చూడాలి. ఎందుకంటే, ప్రతిపక్షంలో ఉన్నపుడు కాగ్ నివేదికను భగవద్గీతతో సమానమని చెప్పిన చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు మాత్రం చెత్త కాగితంగా కొట్టిపారేసారు. కాకపోతే చంద్రబాబుకు కలిసి వచ్చిన అంశమేమిటంటే, అసెంబ్లీ సమావేశాల చివరిరోజున కాగ్ నివేదికను బయటపెట్టటం. లేకపోతే అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వానికి చుక్కలు చూపేదే.

 

 

 

click me!