పక్షాలు పోయాయి, టీడీపీ ఏకాకిగా మిగిలింది: అఖిలపక్షంపై బొత్స వ్యాఖ్యలు

By Nagaraju TFirst Published Jan 30, 2019, 6:11 PM IST
Highlights

బినామీ ఆస్తులు ఎందుకు సీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. మరోవైపు చంద్రబాబు అధ్యక్షతన జరుగుతున్న అఖిలపక్ష సమావేశంపై బొత్స సెటైర్లు వేశారు. చంద్రబాబు నిర్వహించేది అఖిలపక్షం కాదన్నారు. పక్షాలు పోయాయి, పక్షులు మిగిలాయంటూ సెటైర్లు వేశారు. అఖిలపక్ష సమావేశంలో టీడీపీ ఏకాకిగా మిగిలిందని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. 

విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లపై వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులు కాజేసేందుకు తండ్రీ కొడుకులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 

బుధవారం విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన బొత్స 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల సమస్యను ప్రభుత్వం ఆటకెక్కించిందని మండిపడ్డారు. బాధితుల పక్షాన తాము పోరాటం చేస్తుంటే ప్రభుత్వం హడావిడి చేస్తోందని విమర్శించారు. 

రూ.1183 కోట్లు ఇస్తే 80 శాతం మందికి న్యాయం జరుగుతుందని తెలిసినా ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందో లేదో స్పష్టం చెయ్యాలని డిమాండ్ చేశారు. కేబినేట్ సమావేశంలో అగ్రిగోల్డ్ అంశం లేదన్న ఆయన పత్రికల్లో మాత్రం అగ్రిగోల్డ్ బాధితులకు రూ.250 కోట్లు అని రాశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలోనూ అగ్రిగోల్డ్ అంశం ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు. సీబీసీఐడీ వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తుల లిస్ట్ బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ వాచ్‌డాగ్‌లా అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాపాడుతుందని తెలిపారు. ఫిబ్రవరి 4న అగ్రిగోల్డ్ బాధితులతో విజయవాడ ధర్నా చౌక్‌లో నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. 

click me!