
విజయవాడ: కరోనా వల్ల ప్రజల జీవితం దినదినగండంగా మారిన ప్రస్తుత తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచి జనాన్ని దారుణంగా దోపిడీ చేస్తున్నాడని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్ దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలున్నాయని మొసలికన్నీరు కార్చాడని గుర్తు చేశారు. మరి ఈనాడు వాటి ధరలు రూ.100 దాటి డబుల్ సెంచరీ దిశగా వెళ్తున్నా ఆయనలో కించిత్ కూడా స్పందన లేదని బోండా ఉమ మండిపడ్డారు.
''గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగి మహిళలు గగ్గోలు పెడుతున్నా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నవ్యక్తి స్పందించడం లేదు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నిస్తున్నాం. చమురు ధరల పెరుగుదలతో నిత్యావసరాలు, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి'' అని ఆందోళన వ్యక్తం చేశారు.
''2018లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చమురు ధరలు పెంచితే రాష్ట్ర ప్రజలపై భారం పడకుండా పెట్రోల్, డీజిల్ పై రూ.2వరకు తగ్గించారు. రూ.1120కోట్ల వరకు ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని కూడా టీడీపీ ప్రభుత్వం వదులకుంది. అలాంటి ఆలోచన ఈ ముఖ్యమంత్రి ఎందుకు చేయడు?'' అని ప్రశ్నించారు.
''కరోనాతో ఇప్పటికే ప్రజలకు సరైన ఉపాధిలేక ఆదాయం తగ్గిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన జగన్ ప్రభుత్వం రోడ్ల సెస్సు పేరుతో లీటర్ కు కొంతసొమ్ము అదనంగా వసూలు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ అసమర్థత ప్రజలకు శాపంగా మారింది. గత ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిందంటే అందుకు కారణం చంద్రబాబు లాంటి సమర్థుడైన వ్యక్తి అధికారంలో ఉండటమే. మంత్రులు చమురు ధరలపెంపును సిగ్గులేకుండా సమర్థించుకుంటున్నారు. రాష్ట్రాభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం ధరలు పెంచిందని వారు చెప్పడం నిజంగా ప్రజలను మోసగించడమే'' అని అన్నారు.
read more జగన్ గారూ... మళ్లీ పాదయాత్ర ఎందుకు చేయరు?: నాదెండ్ల మనోహర్
''జగన్ అధికారంలోకి వచ్చాక ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఒక్క రోడ్డు వేసింది లేదు. కనీసం రోడ్లపై పడిన గుంతలుకూడా పూడ్చింది లేదు. వర్షాలు పడితే వాహనదారులకు ఏది రోడ్డో, ఏది గుంతో కూడా తెలియని పరిస్థితి. అనేకచోట్ల ద్విచక్ర వాహనదారులు నరక కూపాల్లాంటి రోడ్లపై ప్రయాణిస్తూ యాక్సిడెంట్లకు గురువుతుంటే... సిగ్గులేని మంత్రులు, ప్రభుత్వం రోడ్లు వేస్తున్నామని చెప్పుకుంటున్నారు'' అని మండిపడ్డారు.
''పెట్రోల్, డీజిల్ పై రూపాయి సెస్సు పేరుతో జగన్ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే 5శాతం వరకు ట్యాక్సులు పెంచింది. ఆ విధంగా ప్రజలనుంచి వసూలుచేసే సొమ్మంతా ప్రభుత్వం ఏంచేస్తుందో ఎవరికీ తెలియదు. ప్రజల తరుపున ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురు దాడిచేయడం తప్ప, పాలకులు సమాధానం చెప్పరు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. చమురు ధరలపెంపులో టాప్ లో ఉన్న రాష్ట్రం, అభివృద్ధి, సంక్షేమం, ప్రజాసంతోషంలో అధమస్థానంలో ఉంది'' అని తెలిపారు.
''గతంలో చంద్రబాబు హయాంలో లీటర్ పెట్రోల్ రూ.60 ఉంటే, ఇప్పుడు రూ.108 అయింది. డీజిల్ రూ. 50 నుంచి రూ.100కు చేరింది. ఇవన్నీ ప్రజలు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ధరలు ఎందుకు పెరిగాయో, ఆ విధంగా పెంచిన సొమ్ముని ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తున్నారో ప్రజలంతా ఆలోచించాలని కోరుతున్నాం. ప్రజలపై పెట్రోల్ డీజిల్ ధరలపెంపుతో జగన్ భారం వేయడాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చమురు ధరల పెంపుని నిరసిస్తూ, నేడు (28వతేదీన) నిర్వహించబోయే భారీ ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ రెడ్డికి బుద్ధివచ్చేలా చేయాలి'' అని బోండా ఉమ పిలుపునిచ్చారు.
''చమరు ధరల పెంపుతో ఉప్పు, పప్పు, చింతపండు, నూనెల ధరలు కూడా విపరీతంగా పెరిగాయనే వాస్తవాన్ని మహిళలు గమనించాలి. ధరల పెరుగుదలకు తోడు ఉపాధిలేక కార్మికులు, రోజువారీ కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీయడానిక సిద్ధమైంది. ధరలు పెరగకుండా రూ.5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. కానీ అది అమలు చేయలేదు. దాంతో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి'' అని పేర్కొన్నారు.
''చిరు వ్యాపారులు, ఆటోవాలాలు,పేదలు, మధ్యతరగతి వారు, అసంఘటిత రంగ కార్మికులు ఇప్పటికే ఉపాధి కోల్పో యి తినడానికి తిండికూడా లేక నానా అవస్థలు పడుతున్నారు. అనేక రాష్ట్రాలు కరోనాతో చితికిపోయిన అన్ని వర్గాలను ఆదుకోవడానికి ప్యాకేజీలు, ఆర్థికసాయం ప్రకటిస్తే జగన్ ప్రభుత్వం మాత్రం వారిని దారుణంగా ట్యాక్సులు, పన్నుల పేరుతో దోచేస్తోంది. ఈ వాస్తవాలన్నీ ప్రజలు గమనించి, తెలుగుదేశంతో కలిసి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోరాడాలి'' అని బోండా ఉమ కోరారు.