విశాఖలో మరో భారీ ప్రమాదం: ఫార్మా కంపెనీలో పేలుళ్లు, ఎగిసిపడుతున్న మంటలు

By telugu teamFirst Published 14, Jul 2020, 12:18 AM
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో భారీ ప్రమాదం సంభవించింది. విశాఖలోని సాల్వెంట్ ఫార్మా కంపెనీలో పేలుళ్లు సంభవించాయి. దాంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో భారీ ప్రమాదం సంభవించింది. విశాఖపట్నం ఫార్మా సిటీలో భారీగా పేలుడు సంభవించింది. విశాఖ సాల్వెంట్‌ కంపెనీ‌లో ఈ పేలుడు సంభవించింది. సీఈటీపీ సాల్వెంట్‌ను రీసైల్‌ చేసే పరిశ్రమలో ఈ పేలుడు సంభవించినట్లు సమాచారం. 

సాల్వెంట్‌ స్టోర్‌ చేసే రియాక్టర్‌ ట్యాంకులో పేలుడు జరిగింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో పరిసర ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు. మంటలు ఎగసిపడుతున్న ప్రదేశంలో ఇప్పటికి 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతున్నారు. 

ప్రమాద స్థలానికి చాలా దూరంగా  అగ్నిమాపక శకటాలు ఆగిపోయాయి.  మంటల్ని అదుపు చేసేందుకు సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఆరుగురు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకరిని గాజువాక ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. 

 

విశాఖపట్టణం పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం pic.twitter.com/7kK8cTes7R

— Asianet News Telugu (@asianet_telugu)

కంపెనీలో భారీ శబ్ధాలతో ట్యాంకులు పేలాయి. వర్షం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. పేలుళ్ల శబ్దాలకు ఫైరింజన్లు సమీపంలోకి వెళ్లలేకపోతున్నాయి. ప్రమాద స్థలానికి దూరంగా నిలిచిపోయాయి. ప్రమాద స్థలానికి ఎమ్మెల్యే అదీప్ రాజు, ఆర్డీవో కిశోర్ చేరుకున్నారు. ప్రమాద స్థలానికి భారీగా తరలిస్తున్నట్లు కలెక్టర్ వినయయ్ చంద్ చెప్పారు.

సోమవారం (జులై 13) రాత్రి సుమారు 11 గంటల సమయంలో పరిశ్రమ నుంచి భారీ పేలుడు శబ్దం వినిపించింది. అనంతరం మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా ఎగసిపడుతున్న మంటలను చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పరిశ్రమ నుంచి 2, 3 కి.మీ. వరకు మంటలు కనిపిస్తున్నాయి.

పరిశ్రమ నుంచి పలుమార్లు పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు చెబుతున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలీమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన విషాదం నింపిన నేపథ్యంలో నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు.

 ప్రమాదంపై పరిశ్రమల మంత్రి గౌతమ్ రెడ్డి ఆరా తీశారు. స్థానికులను విధుల్లో ఉన్నవాళ్లను తరలించేందుకు ప్రయత్నించాలని ఆయన సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు

 

విశాఖపట్టణం పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్నిప్రమాదం pic.twitter.com/u8Ep1pdMz3

— Asianet News Telugu (@asianet_telugu)

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 14, Jul 2020, 1:01 AM