
భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడా ఆగేట్టు లేరు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే భాజపాకు ఎన్ని సీట్లు వస్తుందో చెప్పలేరు. అసలు, 175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను పెడితే చాలు. వారిలో ఎంతమందికి డిపాజిట్లు వస్తుందో కూడా చెప్పలేరు. అటువంటిది వచ్చే ఎన్నికల్లో ఏపిలో అధికారంలో ఏ పార్టీ ఉండాలి? ముఖ్యమంత్రిగా ఎవరుండాలి? అనే విషయాలను భాజపానే నిర్ణయిస్తుందని భాజపా అంటోంది.
అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో భాజపా సమేవేశం జరిగింది. జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సంతోష్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్ధన రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న నరేంద్రమోడి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రంలోని సంక్షేమ పథకాలకు కేంద్రం ఇస్తున్న నిధులనే తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తమ పథకాలుగా చెప్పుకోవటం దురదృష్టకరమన్నారు.
కేంద్రం నిధులతోనే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నారట. రైతులందుకుంటున్న ఇన్ పుట్ సబ్సిడి కూడా కేంద్రం ఇస్తున్న నిధులేనంటున్నారు. జాతీయ ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు 100 నుండి 150 రోజుల పనిదినాలను పెంచిన ఘనత కూడా మోడి ప్రభుత్వానిదేనని చెప్పారు.
సరే, అంతా బాగానే ఉంది కానీ పథకాల అమల్లో కేంద్రం నిధులున్నా రాష్ట్రప్రభుత్వం తన పథకాలుగా చెప్పుకోవటం సహజమే. అయితే, కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకయ్యనాయుడు కానీ ఆయన మద్దతుదారులు గానీ ఏనాడైనా రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తోందని ఏనాడైనా చెప్పారా?