
BJP Sunil Deodhar: ఎస్సీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వైకాపా ప్రభుత్వం దూరం చేస్తోందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ సునీల్ దేవ్‌ధర్ ఆరోపించారు. రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దేశంలో అనేక మంది సామాజిక న్యాయం పొందుతున్నారని సునీల్ చెప్పారు.
రాజ్యాంగంలో కేవలం వెనుకబడిన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్ కల్పించారని.. క్రిస్టియానిటీ ముసుగులో బీసీలకు సైతం ఈ ఫలాలు అందించేలా జగన్ ప్రభుత్వ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫలితంగా ఆ రిజర్వేషన్ ఫలాలను అనేక మంది ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం పెంచిన పన్నుల వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ సమయంలో జిన్నా టవర్ గురించి కూడా మాట్లాడారు. జిన్నా టవర్ పేరును ఎందుకు మార్చలేదనీ, పాకిస్థాన్ జాతి పేరు పెట్టడమేమిటనీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే.. తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిది ఏ మతమో సీఎం జగన్ చెప్పాలని సునీల్ దేవ్‌ధర్ డిమాండ్ చేశారు. హిందూత్వం పేరు చెప్పుకుని గెలిచిన వారందరూ అన్యమత ప్రార్థన మందిరాల్లో హిందూ దేవుళ్లను అవమానిస్తున్నారని ఆరోపించారు. జీతాలు, పింఛన్లు సరిగ్గా ఇవ్వలేని సీఎం జగన్.. పాస్టర్లకు నిరాటంకంగా రూ.ఐదు వేలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. రామతీర్థం, అంతర్వేది ఘటనల్లో నిందితులను పోలీసులు ఎందుకు పట్టుకోలేదని, సీబీఐ పేరు చెప్పి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు.
విద్యుత్ మిగులులో ఉన్న రాష్ట్రాన్ని జగన్ తన చేతగానితనం, అతని మూర్ఖపు నిర్ణయాలతో ఏపీ ఇబ్బందులు ఎదుర్కొంటుందని, దక్షిణాదిలో ఉన్న మొత్తం విద్యుత్ కొరతలో 90శాతం రాష్ట్రంలోనే ఉండటం దిగజారిన పరిస్థితులకు నిదర్శమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల పాపం ముమ్మాటికీ సీఎం జగన్‌దేనని విమర్శించారు. అలాగే.. తిరుమలలో భక్తులను ఇబ్బందులకు గురి చేసినందుకు, వారి మనోభావాలను దెబ్బతీసినందుకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని అన్నారు.
భక్తులకు కనీసం తాగునీరు కూడా సరఫరా చేయలేని దయనీయ పరిస్థితుల్లో టీటీడీ అధికారులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టోకెన్‌ల కోసం క్యూలైన్‌లో తొక్కిసలాటలో పలువురు గాయపడటం బాధాకరమన్నారు. కొండపైన పరిస్థితి చూసి భక్తులు భయపడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.