ఏలూరు : ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి, మృతులకు ఎక్స్‌గ్రేషియో

Siva Kodati |  
Published : Apr 14, 2022, 08:13 PM IST
ఏలూరు : ఫ్యాక్టరీలో పేలుడు ఘటన.. బిహార్ సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి, మృతులకు ఎక్స్‌గ్రేషియో

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏలూరు జిల్లాలోని పోరస్ రసాయన పరిశ్రమలో పేలుడు ఘటనపై బీహార్ సీఎం నితీశ్ కుమార్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదంలో మరణించిన బీహార్ వాసులకు నితీశ్ కుమార్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

ఏలూరు జిల్లా (eluru factory blast) ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ రసాయన పరిశ్రమలో (porus chemicals eluru) జరిగిన ఘోర ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి (bihar cm) నీతీశ్‌ కుమార్‌ (nitish kumar) స్పందించారు. ఈ ఘటనలో మృతి చెందిన బిహార్‌ వాసుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో (ex gratia) ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి సీఎం సహాయ నిధి నుంచి రూ.50 వేలు చొప్పున సాయం అందించనున్నట్టు ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా ఏపీ ప్రభుత్వంతో సమన్వయం చేయాలని న్యూఢిల్లీలోని రెసిడెంట్ కమీషనర్‌ను ఆదేశించారు నితీశ్. రసాయన పరిశ్రమలో చోటుచేసుకున్న పేలుడు ఘటనలో మృతి చెందిన వారి భౌతికకాయాలను స్వస్థలాలకు తీసుకొచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. 

ఇకపోతే.. ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఐదుగురు ఘటన స్థలంలోనే సజీవ దహనం కాగా.. మరోకరు ఆస్పత్రి తరలిస్తుండగా మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. 

అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏలూరు ఎస్పి, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. 

ప్రమాదంలో గాయపడిన వారిని నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఇక, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ (ys jagan) రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్