చంద్రబాబు జిల్లాలో పురంధేశ్వరి పాగా ?

First Published Oct 31, 2017, 2:41 PM IST
Highlights
  • చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి ప్రయత్నాలు మొదలుపెట్టారు.
  • మంగళవారం జిల్లా రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకున్నది.

చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరులో పాగా వేయటానికి భారతీయ జనతా పార్టీ నేత పురంధేశ్వరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంగళవారం జిల్లా రాజకీయాల్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకున్నది. భాజపా మహిళా మోర్చా జాతీయ నాయకురాలు, చంద్రబాబుకు ఎన్టీఆర్ కుటుంబంలో బద్ద శత్రువైన పురంధేశ్వరి చిత్తూరు మాజీ ఎంఎల్ఏ సికె బాబుతో భేటీ అయ్యారు. సికె ఇంటికి వెళ్ళిన పురంధేశ్వరి దాదాపు అరగంట సమావేశమయ్యారు.

సరే, తర్వాత మీడియాతో పురంధేశ్వరి మాట్లాడుతూ, సీకె బాబుతో ఎన్నో ఏళ్ళ పరిచయం ఉందన్నారు. సికెను కలవటం వెనుక ఎలాంటి రాజకీయం కూడా లేదని అన్నారు. సికెతో పురంధేశ్వరి కుటుంబానికి సంబంధాలుండే విషయంలో ఎవరకీ ఎటువంటి ఆక్షేపణా లేదు. కానీ, సంవత్సరాల తరబడి ఇద్దరూ రాజకీయాల్లోనే ఉన్నా సికె ఇంటికి వెళ్ళి మరీ పురంధేశ్వరి కలవటమన్నది జరగలేదు. ఇపుడే ఎందుకు వెళ్ళారన్నదే ప్రశ్న.

ఎందుకంటే, రాయలసీమలో భాజపా బలపడేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్న విషయం అందరకీ తెలిసిందే. అయితే, ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఇతర పార్టీ నుండి నేతను ఆకర్షించాలని అనుకున్నా ఎవరూ భాజపా వైపు చూడటం లేదు. ఒకవైపేమో ముందస్తు ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. మరోవైపేమో భాజపాకు నేతల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రస్తుత విషయానికి వస్తే సికె బాబు-భాజపాలకు ఒకరి అండ మరొకరికి అవసరం.

 సికె ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేరు. భాజపాకు కూడా జిల్లా వ్యాప్తంగా చెప్పుకోతగ్గ నేతలూ లేరు. కాబట్టే సికెను భాజపాలో చేర్చుకుంటే ఉభయులు లాభపడవచ్చని పురంధేశ్వరి అనుకుని ఉండవచ్చు. ప్రస్తుతం సికె బాబు ఏ పార్టీలోనూ లేనప్పటికీ బలమైన క్యాడర అయితే ఉంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో బహుశా చిత్తూరు ఎంఎల్ఏ టిక్కెట్టేమైనా పురంధేశ్వరి ఆఫర్ ఇచ్చి వుండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా చంద్రబాబు సొంతజిల్లాలో పురంధేశ్వరి పాగా వేయాలని అనుకోవటం రాజకీయంగా ఆసక్తిగా మారుతోంది.

click me!