శ్రీకాళహస్తి బస్టాండ్ వద్ద తేల్చుకుందాం...వస్తారా?: వైసిపి ఎమ్మెల్యేలు, మంత్రులకు బిజెపి సవాల్

By Arun Kumar PFirst Published Dec 30, 2020, 3:16 PM IST
Highlights

శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ భూ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు నిరూపిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. 

తిరుపతి: సీఎం జగన్ ను శ్రీకృష్ణ దేవరాయలుతో వైసిపి నేతలు పోలుస్తున్నారని... అభినవ జగన్ మోహన్ రాయలు అంటూ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సంబోధిస్తున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి గుర్తుచేశారు. భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరగలేదని ఎమ్మెల్యే అంటున్నారని... వచ్చే నెల జనవరి 5వ తేదీ శ్రీకాళహస్తి బస్టాండ్ వద్దే వీరి అక్రమాలను నిరూపిస్తామన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. 

''మేము వైసీపీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు సవాల్ విసురుతున్నాము. శ్రీకాళహస్తి నుంచి శ్రీకాకుళం వరకూ భూ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు నిరూపిస్తాము. శ్రీకాళహస్తిలో జరిగిన భూఅక్రమణలపై కూడా 5వ తేదీ స్థానిక బస్టాండ్ వద్దకు ఆదారాలతో సహా వస్తాం... ఎమ్మెల్యే వస్తాడా..? లేదా మంత్రులు వస్తారా? ఎవరైనా రండి తేల్చుకుందాం'' అని విష్ఱువర్దన్ రెడ్డి సవాల్ విసిరారు.

ఇక ఉత్తర అయోధ్యగా పేరొందిన రామతీర్థంలోని నాలుగు వందల ఏళ్ల నాటి రామాలయంలో విగ్రహం ధ్వంసం చేయడంపై విష్ఱువర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిరోజు ఏదొరకంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.  ఏకంగా రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసి తల పట్టుకెళ్లారని ఆందోళన వ్యక్తం చేశారు.

''ఇలాంటి ఘటనలు మూల కారణం కొడాలి నాని లాంటి వారి వ్యాఖ్యలే కారణం. విగ్రహాలు ధ్వసమయితే ఏమవుతుందని గతంలో కొడాలి నాని వ్యాఖ్యానించారు అలాంటి వ్యాఖ్యలే ఇవాళ హిందూ దేవాలయాలపై దాడులు చేయడానికి ధైర్యాన్నిస్తున్నాయి'' అని ఆరోపించారు.

''చివరికి కొండపై ఆందోళన చేస్తున్న మా కార్యకర్తలకు ఆహారం కూడా తీసుకెళ్ళకుండా అడ్డుకున్నారు. ఆంతర్వేది ఆలయంలో రధం తగులబెట్టిన ఘటనలో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేస్తే మాపై కేసులు పెట్టారు. ఇలా చట్టాలను కాపాడాల్సిన పోలీసులను వైసీపీ కార్యకర్తలుగా మార్చేశారు'' అని మండిపడ్డారు.

''30లక్షల ఇళ్ల పట్టాల అంశంలో ఒక్క రూపాయి కూడా ఏపీ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. అంతా కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి 60శాతం నిధులు కేంద్రమే ఇస్తోంది. మిగతా మెుత్తం కేంద్ర ఉపాధి హామీ నిధులు వాడుకుంటున్నారు. ఒక్క రూపాయి కూడా జగన్ ఇవ్వడం లేదు. అలాంటిది ఇళ్ల పంపకాలలో కనీసం నరేంద్ర మోడీ ఫోటో కూడా వేయలేదు'' అని అన్నారు.

''అర్బన్ హౌజింగ్ లో సైతం నరేగా డబ్బులు వాడారు. ఇవేమీ భారతీ సిమెంట్ లోంచి తెచ్చిన డబ్బులా? మీ పేరు పెట్టకపోవడానికి. గతంలో బాబుగారు మీలాగే హెరిటేజ్ నుంచి డబ్బులు ఇచ్చినట్లు అయన పేరు పెట్టుకున్నారు.ఆంద్రప్రదేశ్ లో ఒక్కటీ స్కీం లేదు.. అంతా స్కామ్ లే'' అని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు.
 

click me!