టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు . జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ ఏకం కావాలని, రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలకు శ్రీకారం చుట్టాలని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైలులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన తర్వాత పవన్ కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. దీంతో నెలలుగా పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు చెక్ పడినట్లయ్యింది. ఆ తర్వాత పవన్ నిర్వహించిన నాలుగో విడత వారాహి విజయయాత్రలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు. ఇక ఇటీవల టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. మరోవైపు.. వైసీపీ నేతలు మాత్రం ఈ పొత్తుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే టీడీపీ , జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌గానే వుంది.
Also Read: టీడీపీ-జనసేన కూటమిని ప్రజలు తిరస్కరించడం ఖాయం : మంత్రి బొత్స సత్యనారాయణ
చివరి నిమిషంలో ఏమైనా జరగొచ్చు అన్న అభిప్రాయంతో కమలనాథులు వున్నారు. కాగా.. టీడీపీ, జనసేన పొత్తుపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు పార్టీల కలయికతో ప్రజలకు మంచి జరుగుతుందని ఆయన ఆకాంక్షించారు. జగన్ మరోసారి అధికారంలోకి రాకుండా పార్టీలన్నీ ఏకం కావాలని, రాక్షస రాజ్యం నుంచి సుపరిపాలనకు ప్రజలకు శ్రీకారం చుట్టాలని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏపీలో జరిగిన లిక్కర్ స్కామ్ చాలా పెద్దదని.. వైసీపీలో నికృష్ణమైన నేతలున్నారని, శత్రువుపైనా వ్యక్తిగతంగా మాట్లాడకూడదని గోరంట్లపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని విష్ణుకుమార్ రాజు జోస్యం చెప్పారు.