డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు: ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ అక్టోబర్ 7వ తేదీకి పొడిగింపు

By narsimha lodeFirst Published Sep 23, 2022, 3:15 PM IST
Highlights

డ్రైవర్ సుబ్రమణ్యం  హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఈ ఏడాది అక్టోబర్ 7వ తేదీ వరకు రిమాండ్ ను పొడిగించింది కోర్టు.

కాకినాడ: డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు  ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు రిమాండ్ ను పొడిగించింది.   అనంతబాబును ఈ ఏడాది అక్టోబర్ 7వ తేదీ వరకు  రిమాండ్ ను పొడిగించింది కోర్టు.  డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. దీంతో  కోర్టు అనంతబాబుకు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. ఈ ఏడాది మే 23వ తేదీ నుండి అనంతబాబు రిమాండ్ లో ఉన్నాడు. 

ఇటీవలనే అనంతబాబు తల్లి మృతి చెందడంతో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. తల్లి  అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత అనంతబాబు తిరిగి జైలుకు వెళ్లారు.  అయితే ఇదే సమయంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఈ సమయంలోనే అనంతబాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఆగష్టు 25వ తేదీన  తిరిగి సెంట్రల్ జైలుకు వెళ్లాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. దీంతో  అనంతబాబు  జైలులోనే ఉన్నారు .   రిమాండ్ ఇవాళ్టితో ముగుస్తున్నందున అనంతబాబుకు రిమాండ్ ను పొడిగించింది. డ్రైవర్ సుబ్రమణ్యం భార్యకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. వైద్య ఆరోగ్య శాఖలో సుబ్రమణ్యం భార్యకు జూనియర్అసిస్టెంట్ గా ప్రభుత్వం ఉద్యోగం కల్పించింది.సుబ్రహ్మణ్యం తల్లికి, భార్యకు ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు ఇంటి స్థలాన్ని కూడా మంజూరు చేశారు. రెండున్నర ఎకరాల సాగుభూమిని అందించారు.

ఈ ఏడాది మే 20వ తేదీన డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకు గురయ్యాడు. మద్యం తాగొద్దని మందలించిన సమయంలో తనకు ఎదురు తిరగడంతో ఎమ్మెల్సీ  అనంతబాబు చేయిచేసుకున్నాడు. ఈ క్రమంలోనే కింద పడి గాయపడి సుబ్రమణ్యం మరణించాడని పోలీసులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపుగానే ఆయన మరణించాడని పోలీసులు ప్రకటించారు. అయితే రోడ్డు ప్రమాదంగా దీన్ని చిత్రీకరించేందుకు ఎమ్మెల్సీ అనంతబాబు ప్రయత్నించారని తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా పోలీసులు తెలిపారు.ఈ కేసులో అరెస్టైన  అనంతబాబును వైసీపీ నుండి ఆ పార్టీ సస్పెండ్ చేసింది. 
 

click me!