
హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కాకరేపిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు పలు పార్టీల నేతలు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంపై స్పందించారు. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ కూడా జగన్ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని స్వయంగా జగన్ సోదరి షర్మిల కూడా తప్పుబట్టారని సీఎం రమేశ్ చురకలు వేశారు. ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తక్షణం వెనక్కి తీసుకోవాలని సీఎం రమేశ్ డిమాండ్ చేశారు. తనకు ఎవరు ఎదురుతిరిగినా వారి అంతుచూస్తా అన్నట్లుగా జగన్ పాలన వుందని... ఇలాగే వెళితే 175 సీట్లు ఎలా గెలుస్తారంటూ ఆయన చురకలు వేశారు.
ALso REad:హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తొలిగించటాన్ని ఖండించిన నందమూరి రామకృష్ణ.. ఏమన్నారంటే..
రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తోన్న యాత్రను అడ్డుకోవడం సాధ్యం కాదని, బీజేపీ అడ్డంగా వుంటుందని సీఎం రమేశ్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రలో అమరావతి రైతులకు తాము రక్షణగా వుంటామని.. రైతులపై దాడికి దిగితే బీజేపీపై చేసినట్లేనని ఆయన హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో అధికార పార్టీకి మూడు సీట్లు కూడా రావని సీఎం రమేశ్ జోస్యం చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రజలకు రూ.10 ఇచ్చి.. రూ.100 దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.
ఇకపోతే.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై నిన్న ఓ టీవీ చానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమధానమిచ్చారు వైఎస్సార్‌టీపీ చీఫ్ వైఎస్ షర్మిల. పేర్లను మార్చకూడదని ఆమె స్పష్టం చేశారు. పేర్లను మారిస్తే.. పవిత్రత పోతుందని షర్మిల అన్నారు. ఒక్క పేరంటూ పెట్టిన తర్వాత .. ఆ పేరును తరతరాల పాటు కంటిన్యూ చేస్తే వాళ్లకు గౌరవం ఇచ్చినట్టుగా ఉంటుందన్నారు. అంతేకాకుండా కన్ఫ్యూజన్ ఉండదన్నారు. ఒక్కొసారి ఒక్కో పేరు పెట్టుకుంటూ పోతే ఎవరు ఏది రిఫర్ చేస్తున్నారో కూడా అర్థం కాదని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. షర్మిల చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని టీడీపీ శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. షర్మిల చేసిన వ్యాఖ్యల వీడియోను షేర్ చేస్తూ.. వర్సిటీ పేరు మార్పుపై జగన్ నిర్ణయాన్ని కార్నర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు.