
అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఆంధ్రప్రదేశ్ బిజెపి నేతలు చేతులెత్తేశారు. విశాఖ ఉక్కు కర్మారాగరం ప్రైవేటీకరణ తప్పదని వారన్నారు. తిరుపతి లోకసభ ఉప ఎన్నికలపై, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై శనివారం బిజెపి నేతలు సమావేశమై చర్చించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఆగదని ఎమ్మెల్సీ మాధవ్ చెప్పారు.
ప్లాంటును బతికించేందుకు, రక్షించేందుకు ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. విశాఖ ఉక్క ప్రైవేటీకరణ వల్ల కార్మికులకు ఏ విధమైన నష్టం జరగదని ఆయన చెప్పారు.
ప్రైవేటీకరణ నిర్ణయం దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్రం తీసుకుందని, అది విశాఖ ఉక్కు కర్మాగారానికి మాత్రమే పరిమితమైంది కాదని బిజెపి ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ సునీల్ దియోధర్ అన్నారు. వైసీపీ, టీడీపీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకు పెరిగిందని బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. కార్పోరేషన్, నగరపాలక సంస్థల ఎన్నికల్లో తాము అధిక సీట్లు గెలుచుకంటామని చెప్పారు. కొన్ని బలవంతపు ఏకగ్రీవాలు చేయించారని ఆయన విమర్శించారు. ఓట్ల లెక్కింపు సమయంలో అధికార వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన అన్నారు.